కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన్: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీల ప్రక్రియలో నిబంధనలను అతిక్రమించరాదన్నారు. ఏ దశలోనూ విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న వాహనాల వేలం ప్రక్రియను జూన్ 20లోపు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్‌టీఏ అధికారులకు లేఖ రాస్తే వారు వచ్చి పరిశీలించి నివేదిక ఇస్తారన్నారు. కార్యాలయాల్లో వృథా సామగ్రిని కూడా వేలం వేయించి సంబంధిత రికార్డుల్లో వివరాలను పొందుపర్చాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి అడ్వా న్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లాలో 975 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 3,043 మంది విద్యార్థులకు గాను 2,068 మంది హాజరయ్యారు. 42 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 21 కేంద్రాలను తనిఖీలు చేశాయి.
రేపు డీఈఓ కార్యాలయ ముట్టడి
టీచర్లు తరలిరావాలని ఉపాధ్యాయ సంఘాల వేదిక పిలుపు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ రంగ సమస్యలపై సోమవారం ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈనెల 21న జిల్లాలో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు వైఎస్సార్‌టీఏ ఎస్.నాగిరెడ్డి, ఆప్టా కె.వెకంటరత్నం పిలుపునిచ్చారు.
విజయవాడలోని విద్యాభవన్‌లో దాదాపు 8 గంటలకు పైగా పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, సంచాలకులు విజయరామరాజుతో ఉపాధ్యాయ సంఘాలు జరిపిన చర్యలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. 16 ప్రధాన డిమాండ్లపై ఉన్నతాధికారులు–ఉపాధ్యాయ సంఘాల నేతలు జరిపిన చర్చలు కొలిక్కి రాలేదన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చలు జరపాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరినా అధికారులు అంగీకరించలేదన్నారు. ఈ క్రమంలో 21న డీఈఓ కార్యాలయాల ముట్టడి, 23న కమిషనర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
బ్యాంక్‌కు తాళం వేసిన రైతులు
శెట్టూరు: పంట రుణాలు రెన్యూవల్ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంక్‌కు తాళం వేసి ధర్నా చేపట్టారు. శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో ఈ ఘటన చోటు చేసు కుంది. వివరాలు.. సోమవారం ఉదయం పంట రుణాల రెన్యూవల్ చేయాలంటూ లక్ష్మంపల్లిలోని కెనరా బ్యాంక్ శాఖకు 40 మంది రైతులు వెళ్లారు. అయితే బ్యాంక్‌లో రైతులకు సంబంధించి వన్ బీలు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో పంట రుణాలను రెన్యూవల్ చేయడం సాధ్యం కాదంటూ బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో కొందరు రైతులు మీ సేవ నుంచి, మరికొందరు తహసీల్దార్ సంతకంతో కూడిన 1 బీలను తీసుకెళ్లి బ్యాంక్ అధికారులకు అందజేశారు.
వీటిని తాము పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేయడంతో రైతుల్లో అసహనం పెల్లుబుకింది. వెంటనే బ్యాంక్‌కు తాళం వేసి గేట్ ఎదుట బైటాయించారు. సకాలంలో పంట రుణాలు రెన్యూవల్ చేయకపోతే తీవ్రంగా నష్టపోయేది రైతులేనన్న విషయాన్ని బ్యాంక్ అధికారులు విస్మరించారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకుల్లో రైతుల సమస్యలు, కష్టాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పంట రుణాలు రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు వైస్ ఎంపీపీ ముత్యాలు,వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల నాయకుడు ఇమామ్ వలీ, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.

పకడ్బందీగా బదిలీల ప్రక్రియ