
సారూ.. సమస్యలు పరిష్కరించండి
అనంతపురం అర్బన్:‘సమస్యలు పరిష్కరించండి సారూ’ అంటూ అధికారులను పలువురు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ మలోల,డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్,రామకృష్ణారెడ్డి, ఆనంద్, తిప్పేనాయక్ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 460 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించడంతో పాటు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని...
● చలానా కట్టినా భూమిని సర్వే చేసేందుకు రావడం లేదని అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డికి చెందిన రాము ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 44–3లో 1.69 ఎకరాలు, 43–4లో 90 సెంట్ల సర్వే కోసం చలానా కట్టామని, సర్వేయర్ అందుబాటులో ఉండడం లేదని చెప్పాడు. తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
● ప్రభుత్వం మంజూరు చేసిన ప్లాట్‌కు హద్దులు చూపించడం లేదని అనురాధ ఫిర్యాదు చేసింది. రాప్తాడు మండలం పండమేరు గ్రామ సర్వే నంబర్ 134, 135లో వేసిన లే–అవుట్‌లో తమకు 362వ ప్లాట్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే ఈ ప్లాట్‌కు హద్దులు చూపించాలని తహసీల్దారు కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపింది. సర్వే చేయించి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరింది.
● శింగనమల మండలం చక్రాయపేట గ్రామ సర్వే నంబర్ 539–2,4,5, 538లో కొందరికి ప్రభుత్వం డీ పట్టా ఇచ్చిందని, అయితే ఒక వ్యక్తి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ గుట్టతో పాటు భూముల్లో యంత్రాల సహాయంతో మట్టిని తోడేసి అక్రమంగా తరలిస్తున్నాడని వెంకటస్వామి ఫిర్యాదు చేశాడు.
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అర్జీదారుల వేడుకోలు
వివిధ సమస్యలపై 460 వినతులు