
మురిపించాయి.. ముంచేస్తాయా?
అనంతపురం అగ్రికల్చర్: అవసరం లేని సమయంలో అధిక వర్షాలు పడుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్‌లో పంటలు విత్తుకునే సమయంలోనూ, లేదంటే పంటలు కీలక దశకు చేరుకున్న సమయంలో వెనుకటి వర్షాలు చేయిస్తాయేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి అనుభవాలను చవిచూశామని గుర్తు చేసుకుంటున్నారు. ముందస్తు వర్షాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మే సాధారణ వర్షపాతం 36.7 మి.మీ కాగా... అందులో మే 19 నాటికి 16.8 మి.మీ పడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే ఏకంగా 79.6 మి.మీ వర్షం కురిసింది. 31 మండలాల్లోనూ సాధారణం కన్నా ఐదు నుంచి పదింతల రెట్టింపు వర్షపాతం నమోదైంది. ఇంత వరకూ బాగానే ఉన్నా రాబోయే రోజుల్లో వర్షాలు ముఖం చాటేస్తాయేమోననే ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. విత్తుకు ఇంకా 10 రోజులు మిగిలిఉండటం, వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో... ఇప్పుడు కురిసే వర్షాలు ముంగారుకు ఏ విధంగానూ ఉపయోగపడవని చెబుతున్నారు.
జూన్ 15 తర్వాత సాగుకు అదను..
ఖరీఫ్‌లో పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు మంచి అదనుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సారి ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇంకా వర్షసూచన ఉందని చెబుతున్నారు. అలాగే కీలకమైన నైరుతీ రుతుపవనాలు ఈ సారి ముందస్తుగానే అంటే ఈనెల 27న కేరళను తాకుతాయని వారం క్రితమే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఉన్నందున ఇంకా ముందుగానే అంటే 24న కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ నెలాఖరుకు ‘అనంత’లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. మరోపక్క కూటమి సర్కారు, వ్యవసాయశాఖ ఇప్పటికీ విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది.
బెళుగుప్ప మండలం
నాగులచెరువులో నీరు
ముందస్తు వర్షాలతో
రైతుల్లో ఆందోళన
ఖరీఫ్ కీలక దశలో ముఖం
చాటేస్తాయేమోనని అనుమానం
23 మండలాల్లో వర్షం
జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 23 మండలాల పరిధిలో 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కంబదూరు 28.8 మి.మీ, శింగనమల 22.2, నార్పల 18.6, కుందుర్పి 17.8, గార్లదిన్నె 13.6, డీ.హీరేహాళ్ 11, ఆత్మకూరు 10 మి.మీ వర్షపాతం నమో దైంది. గుమ్మఘట్ట, బొమ్మనహాళ్, పామిడి, రాప్తాడు, బుక్కరాయసముద్రం, అనంతపురం, బెళుగుప్ప, శెట్టూరు, బ్రహ్మసముద్రం, గుంతకల్లు, పుట్లూరు, యాడికి, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, యల్లనూరు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. రాగల రెండు రోజులు కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
చెరువుల్లోకి నీళ్లు..
వర్షాలకు 20 చెరువులు పూర్తిగా నిండిపోగా మరో 20 చెరువుల్లోకి 75 శాతం నీళ్లు చేరినట్లు తెలిసింది. బెళుగుప్ప, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్లు, పామిడి, పెద్దవడుగూరు, రాప్తాడు, వజ్రకరూరు, అనంతపురం రూరల్, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి.