
సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందాలి
బుక్కరాయసముద్రం: రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందేలా చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ సూచించారు. బీకేఎస్ మండలం రేకులకుంటలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానంలో అత్యల్ప వర్షపాత మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. రానున్న ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతాంగానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు. పంటల సాగులో మెలకువలు, సూచనలు సలహాలు నిరంతరం అందించాలన్నారు. అనంతరం పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా రైతాంగ పంటల సాగు, వివిధ రకాల పంటలలో యాజమాన్య పద్దతులపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రాంతీయ పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ జాన్సన్, ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, రేకులకుంట పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ విజయశంకర్‌బాబు, రెడ్డిపల్లి ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర పాల్గొన్నారు.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ