పంట నష్టం వివరాలు పంపండి | - | Sakshi
Sakshi News home page

పంట నష్టం వివరాలు పంపండి

Nov 14 2024 9:19 AM | Updated on Nov 14 2024 9:19 AM

అనంతపురం అగ్రికల్చర్‌: కరువు జాబితాలో ప్రకటించిన మండలాల్లో పంటల నష్టంపై జాబితా రూపొందించి పంపాలని వ్యవసాయశాఖ కమిషనరేట్‌ నుంచి జిల్లా అధికారులకు బుధవారం ఉత్తర్వులు అందాయి. జిల్లాలో అనంతపురం, నార్పల, విడపనకల్లు, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు కరువు మండలాల జాబితాలో ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల, కనగానపల్లి, ధర్మవరం, ఎన్‌పీ కుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి మండలాలను ప్రకటించారు. మిగిలిన 46 మండలాలు కరువు జాబితాలో చేర్చలేదు.

గరిష్టంగా రెండు హెక్టార్లకు..

కరువు మండలాలుగా ప్రకటించిన నేపథ్యంలో రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ (పెట్టుబడిసాయం) ఇవ్వడానికి వీలుగా స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌), నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నిబంధనల మేరకు పంట నష్టం అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 33 శాతం అధికంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి.. ప్రతి రైతుకూ గరిష్టంగా రెండు హెక్టార్లకు పరిగణలోకి తీసుకుని సమగ్ర వివరాలతో కూడిన 33 కాలమ్స్‌ ఫార్మాట్‌ సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు, ఏవోలు, ఏడీఏలతో కూడిన గ్రామ, మండల, సబ్‌ డివిజినల్‌ బృందాలతో పంట నష్టం జాబితా తయారు చేయాలని ఆదేశించారు. ఈనెల 20 నుంచి 25 తేదీల మధ్య ఆర్‌ఎస్‌కేల్లో జాబితాను ప్రదర్శించాలని, పొరపాట్లు, తప్పిదాలు ఉంటే అభ్యంతరాలు స్వీకరించి అవసరమైతే సవరణ చేయాలని సూచించారు. తుది జాబితా ఈనెల 28న ప్రభుత్వానికి అందజేయాలని పేర్కొన్నారు. ఎక్కడా డబుల్‌ ఎంట్రీలు, పొరపాట్లు లేకుండా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఉపశమనం ఇలా..

పంటనష్టం ఉపశమనం కింద (స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌) కింద వేరుశనగ, పత్తి, వరి, మిరప, కూరగాయలు, ఉల్లి, పూలు, బొప్పాయి, కళింగర, కర్భూజా పంటలకు హెక్టారుకు రూ.17 వేల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మొక్కజొన్న హెక్టారుకు రూ.12,500, కంది, మినుము, పెసలు, అలసంద లాంటి పప్పుదినుసు పంటలకు హెక్టారుకు రూ.10 వేలు, జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఆముదం పంటలు హెక్టారుకు రూ.8,500 ప్రకారం ఒక్కో రైతుకు గరిష్టంగా 2 హెక్టార్లకు పరిహారం అందేలా జాబితాలు సమగ్రంగా తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయశాఖ అధికారులు జాబితాలను రూపొందించడంపై దృష్టి సారించారు.

వ్యవసాయ కమిషనరేట్‌ ఉత్తర్వులు

గరిష్టంగా రెండు హెక్టార్లకు ‘ఇన్‌పుట్‌’

46 మండలాల రైతులకు సబ్సిడీ నిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement