
కనగానపల్లి: దేవాలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆహారం కలుషితమై వంద మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కనగానపల్లి మండలంలో చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కుర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రాముడి గుడిని శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మధ్యాహ్నం అక్కడే భోజనాలు చేశారు. ఆహారం తిన్న తర్వాత కొంతసేపటికి కొందరు వాంతులు, విరేచనాలు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీపంలోని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కూడా అక్కడ భోజనాలు చేసిన వారిలో చాలా మందికి ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మవరం, మామిళ్లపల్లి, రాప్తాడు, బత్తలపల్లిలోని 108 వాహనాలన్నింటినీ హుటాహుటిన కుర్లపల్లికి పంపించారు. వీటి ద్వారా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 60 మందిని ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. అలాగే ప్రైవేటు వాహనాల ద్వారా మరో 50 మంది దాకా ధర్మవరం, అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో కుర్లపల్లికి చెందిన వృద్ధులు లక్ష్మిరెడ్డి, నారాయణరెడ్డితో పాటు జ్ఞానవి అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచినట్లు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
బాధితులకు పరామర్శ
ధర్మవరం: కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై ధర్మవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేలా వైద్యులను ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశించారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించాలన్నారు. వారి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, ధర్మవరం కౌన్సిలర్లు పెనుజూరు నాగరాజు, గజ్జాల శివ, వైఎస్సార్‌సీపీ నాయకులు చాంద్‌బాషా, ఎస్‌పీ బాషా తదితరులు ఉన్నారు.
కుర్లపల్లిలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఘటన
