
గొందిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలో గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్ బర్దర్
రాప్తాడు: ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే వారిని ఉపేక్షించరాదని ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించారు. గురువారం రాప్తాడు మండలంలో సమస్యాత్మక గ్రామాలైన ప్రసన్నాయపల్లి, గొందిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎస్పీ పర్యటించారు. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నిష్పక్షపాత ఎన్నికలే లక్ష్యంగా పని చేద్దామన్నారు. 44వ జాతీయ రహదారిపై వాహన తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని డీఎస్పీ, సీఐలకు సూచించారు. అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండాలని ఆయా గ్రామాల ప్రజలకు సూచించారు. ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట శివా రెడ్డి, సీఐ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఘర్షణలకు దూరంగా ఉండండి
ఆత్మకూరు: ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలకు దూరంగా ఉండాలని ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి, పోలీసు సిబ్బందితో కలసి తోపుదుర్తి గ్రామంలో గురువారం రాత్రి ఆయన పర్యటించారు. ప్రజలతో సమావేశం నిర్వహించారు. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పల్లెల్లో ప్రశాంతంగా జీవించాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.