యువతితో వీడియో కాల్‌: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా.. 

- - Sakshi

ఏప్రిల్‌ 14న అనంతపురంలోని ఓ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న విక్రమ్‌కు వీడియోకాల్‌ వచ్చింది. ఆన్‌ చేయగానే యువతి నగ్నంగా కనిపించింది. ఇంకేముంది విక్రమ్‌ ఆసక్తిగా మాట్లాడాడు. కాల్‌ పూర్తయ్యాక వీడియో రికార్డింగ్‌ మొత్తం మొబైల్‌కు వచ్చింది. తర్వాత ఆ యువతి డబ్బు డిమాండ్‌ చేసింది.

అనంతపురం సాయినగర్‌లో కేఫ్‌ యజమానికీ ఇలాగే కాల్‌ రావడంతో మాట్లాడాడు. అమ్మాయి మాటలు నమ్మి ఇంటి చిరునామా, పర్సనల్‌ మొబైల్‌ నంబర్‌ అన్నీ ఇచ్చాడు. మాట్లాడిన వీడియోలు పంపుతూ టార్చర్‌ పెడుతోందని వాపోయాడు. మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతానంటూ కూడా భయపెడుతోందని తెలిపాడు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏదో రకంగా డబ్బు సంపాదించాలి.. కష్టపడకుండానే డబ్బు వచ్చి ఒళ్లో వాలిపోవాలి. చుక్క చెమట పట్టకుండా లక్షాధికారులు కావాలి.. పెడదారిలో వెళుతున్న యువత ఆలోచనలు ఇవీ. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌ మరింతగా పెరిగింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మాయ చేసి మోసగిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో జరిగిన కొన్ని ఘటనలతో కుర్రాళ్లు బెంబేలెత్తుతున్నారు.

ఆశ పడితే.. అధోగతే!
కొంతమంది అమ్మాయిలు వీడియోకాల్‌ చేస్తారు. ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే నగ్నంగా కనిపిస్తారు. వెంటనే ఫోన్‌ కట్‌ చేస్తే ఫరవాలేదు. కొంతమంది కుర్రాళ్లు ఇలాంటి దృశ్యాలు చూసి ‘ఆశ’గా మాటలు కలుపుతారు. కుర్రాళ్లను కూడా బట్టలు లేకుండా వీడియోకాల్‌లోకి రావాలని కోరుతారు. ఈ వీడియోను రికార్డింగ్‌ చేస్తారు. ఇలా మాట్లాడుతుండగానే ఫోన్‌కట్‌ అవుతుంది. ఆ తర్వాత వాట్సాప్‌ కాల్‌ చేస్తారు.

బ్లాక్‌మెయిల్‌ ఇలా చేస్తున్నారు..
ఎవరైతే వీడియోకాల్‌లో మాట్లాడారో ఆ వీడియోను మొబైల్‌కు పంపిస్తారు. అనంతరం డబ్బులు పంపించాలని డిమాండ్‌ చేస్తారు. లేదంటే ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరిస్తారు. ఈ వీడియోలో ఇరువురి ఫొటోలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారిగా అబ్బాయిలు కలవరపాటుకు గురవుతారు. ఎంతోకొంత ఫోన్‌ పే చేసి వదిలించుకుంటారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సందర్భాలూ లేకపోలేదు. ఇది ఒకరకంగా హనీట్రాప్‌ లాంటిదని పోలీసులు చెబుతున్నారు.

సైబర్‌ మోసాలపై అప్రమత్తం 
సైబర్‌ మోసాలు పెరుగుతున్నాయి. మనకు తెలియని వ్యక్తులు వీడియోకాల్‌ చేసినా, లింక్‌లు పంపినా వాటిని క్లిక్‌ చేయొద్దు. చాలామంది మొబైల్స్‌లో ఇలాంటి లింకులతో కొత్త యాప్‌ చేరి మన ఆధారాలన్నీ దొంగల చేతికి వెళుతున్నాయి. ఖాతాల్లో సొమ్ము పోవడానికీ ఇదే కారణం. మొబైల్‌లో ఉన్న ఇలాంటి దొంగ యాప్‌లను తొలగించడం కూడా చాలామందికి తెలియదు. అందుకే పోలీసులతోనే వీటిని మొబైల్‌నుంచి ఎలా తొలగించాలో ప్రొజెక్టర్‌ల ద్వారా చూపించి చేయాలని నిర్ణయించాం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొబైల్స్‌లో ప్రమాదకర యాప్‌లను తొలగించే ప్రక్రియ చేపడుతున్నాం.
– ఆర్‌ఎన్‌. అమ్మిరెడ్డి, డీఐజీ, అనంతపురం రేంజ్‌

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top