కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకు కొత్త కావొచ్చు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే తొలి ప్రాధాన్యత. పేదల సొంతింటి కల సాకారం చేస్తాం. ప్రభుత్వమే పేదలందరికీ పట్టణాలు, పల్లెల్లో ఉచితంగా స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తోంది. హౌసింగ్ విషయంలో పేదలందరికీ గరిష్టంగా లబ్ధి జరగాలి. సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో అందాలి’ అని కలెక్టర్ ఎం.గౌతమి అన్నారు. జిల్లాకు నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె సోమవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కలెక్టర్ మాటల్లోనే...

సెంటిమెంట్‌ను గౌరవిస్తాం..
భూముల రీసర్వే యజ్ఞంలా జరుగుతోంది. భూములపై హక్కులు ఆ కుటుంబానికి సెంటిమెంట్‌తో కూడుకున్నవి. ఆ సెంటిమెంట్‌ను గౌరవిస్తాం. రీసర్వే పెద్ద ప్రాజెక్టు. దీన్ని అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.
అందరికీ ఫలాలు అందాలి
అర్హులై ఉండి ఫలానా ప్రభుత్వ పథకం నాకు అందలేదు అన్న ఫిర్యాదే రాకూడదు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేయాలని సీఎం చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. వారికి లబ్ధి జరిగేలా చేస్తాం.

‘నాడు–నేడు’ పనులకు మరింత పదును
ఈరోజు చాలా ఊర్లలో చూశాను. నాడు – నేడు పనులతో ఆస్పత్రులు, స్కూళ్లు చాలా బాగుపడ్డాయి. జిల్లాలో జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేస్తాం. కొత్తగా రూపుదిద్దుకునే పాఠశాలలు భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేస్తాయి. ప్రైవేటు స్కూళ్లకంటే ప్రభుత్వ స్కూళ్లు బాగున్నాయన్న అభిప్రాయం కలిగేలా చేస్తాం. ఇక ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులు పూర్తి చేసి మెరుగైన వైద్యసేవలు అందిస్తాం.
హౌసింగ్ ప్రాజెక్టు పనులపై..
ఈ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం పేదలందరికీ సొంతిళ్లు. ఇదే నా మొదటి ప్రాధాన్యత. సవాళ్లు ఎన్ని ఎదురైనా పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత పూర్తిచేస్తాం.
జిల్లాపై అవగాహన ఉంది
కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకు కొత్త కావొచ్చు.. కానీ ఇక్కడ నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)గా మూడేళ్లకు పైగా పనిచేశాను. జిల్లాల విభజన తర్వాత పరిధి తగ్గి ఉండచ్చు కానీ.. ఈ జిల్లాపై నాకు మంచి అవగాహన ఉంది. ఇది నాకు మంచిగా కలిసొచ్చే అంశం.

గతేడాది పది ఫలితాలు..
గత ఏడాది 10వ తరగతి ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. పదో తరగతిలో ఒత్తిడి పెంచడం కాదు.. ఏడో తరగతి నుంచే వారిని సంసిద్ధం చేస్తాం. దీనిపై ఈరోజే డీఈఓతో చర్చించాను. ఇకపై స్కూళ్లపై ప్రత్యేక ఫోకస్‌తో పనిచేస్తాం.
అనంతను అగ్రగామిగా తీర్చిదిద్దుదాం
అనంతపురం: ‘అనంతపురం జిల్లాతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో ఆర్డీఓగా పనిచేసిన స్థానంలోనే కలెక్టర్‌గా సేవ చేసే భాగ్యం దక్కడం గర్వంగా ఉంది’ అని కలెక్టర్ ఎం.గౌతమి అన్నారు. కలెక్టర్‌గా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేసిన నూతన కలెక్టర్‌కు జేసీ కేతన్‌గార్గ్ స్వాగతం పలికారు. తర్వాత కలెక్టర్‌ను డీఆర్వో గాయత్రీదేవి, కలెక్టరేట్ ఏఓ విజయలక్ష్మి, ఆర్డీఓ మధుసూదన్, డీఐపీఆర్వో గురుస్వామిశెట్టి, ఎల్డీఎం నాగరాజారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఐ.నరసింహారెడ్డి, తహసీల్దార్ శ్రీరామమూర్తి తదితరులు చాంబర్‌లో కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ‘స్పందన’లో పాల్గొని జేసీ కేతన్‌గార్గ్‌తో కలిసి ప్రజల నుంచి 228 అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అధికారులందరూ సమన్వయంతో సమష్టిగా పనిచేసి జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పునర్వ్యవస్థీకరణ అనంతరం 31 మండలాలు, మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, ప్రతి మండలంపైనా ఫోకస్ చేస్తామన్నారు. భూ సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. స్పందన నిర్వహణలో లోపాలున్నట్లు స్పష్టమైందని, అధికారులు పనితీరు మార్చుకుని సకాలంలో పరిష్కారం చూపాలని సూచించారు.
కలెక్టర్ ప్రస్థానం ఇలా..
2007 – 2009 వరకు చిత్తూరు జిల్లాలో ప్రొబేషనరీ అధికారిగా ప్రస్థానం
2009 నుంచి 2012 వరకు అనంతపురం ఆర్డీఓగా పనిచేశారు.
2012 – 2015 వరకు నెల్లూరు డ్వామా పీడీ
2015 – 19 వరకు టీటీడీ డిప్యూటీ ఈఓగా..
2019 – 22 వరకు వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా..
2022 – 2023 ఏప్రిల్ 7 వరకు తిరుపతి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సీఈఓ


