ఎన్నాళ్లీ గ్రహణం! | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ గ్రహణం!

Sep 18 2026 1:33 AM | Updated on Sep 18 2026 1:33 AM

పూడమడక ఫిషింగ్‌ హార్బర్‌ పనులు ప్రారంభించేది ఎప్పుడో?

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.387 కోట్లు మంజూరు

కూటమి హయాంలో పనుల్లో జాప్యం

2024 ఆగస్టులో మళ్లీ వర్చువల్‌ విధానంలో పనులు ప్రారంభిస్తున్నట్టు హడావిడి

తాజాగా రూ.708 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం

సెజ్‌ కంపెనీ వ్యర్థాలతో ఇప్పటికే అపురూపమైన మత్స్య సంపదను కోల్పోయిన గంగపుత్రులు

హార్బర్‌ పనులకు

సాక్షి, అనకాపల్లి : వందలాది మత్స్యకార కుటుంబాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. క్రెడిట్‌ చోరీలో అందవేసిన చెయ్యిగా నిలిచిన రాష్ట్ర పాలకుల్లో కనీసం బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఏపీలో విశాలమైన సముద్ర తీరం కలిగినప్పటికీ మత్స్యకారులకు సరైన న్యాయం దక్కడం లేదు. పారిశ్రామికంగా తీర ప్రాంతాలను కార్పొరేట్‌ సంస్థలు ఎన్నుకోవడంతో సగటు మత్స్యకారునికి కష్టాలు మొదలయ్యాయి. ఈ సమయంలో మత్స్యకారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం దాగుడు మూతలాడుతోంది. 73 కిలో మీటర్ల తీర ప్రాంతం కలిగిన అనకాపల్లి జిల్లాలో పూడిమడక వద్ద 2022లో ఫిషింగ్‌ హార్బర్‌ పనుల్ని అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మొదలుట్టారు. అనతి కాలంలోనే ఎన్నికలు రావడం, తర్వాత ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఫిషింగ్‌ హార్బర్‌ పనుల్లో కదలిక లేదు. స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా 2024 ఆగస్టు 30 వర్చువల్‌ విధానంలో రెండోసారి ప్రారంభోత్సవ పనుల హడావిడి చేసినప్పటికీ నిర్మాణ పనులకు అతీగతీ లేకుండా పోయింది.

అనకాపల్లి జిల్లాలో కీలకం

అనకాపల్లి జిల్లా పరిధిలో 73 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలోని 31 మత్స్య గ్రామాలు ఉన్నాయి. 12 వేల మత్స్య కుటుంబాలు కేవలం చేపల వేట, విక్రయంపైనే ఆధారపడి ఉంటున్నారు. వీరు చేపలు విక్రయించాలంటే మధ్యవర్తితో సంబంధం లేకుండా విశాఖ హార్బర్‌కు వెళ్లాలి. పూడిమడక వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తే చేపల విక్రయం ఇక్కడే జరుపుకోవచ్చు. పూడిమడక చేపలకు విదేశాల్లోనూ డిమాండ్‌ ఉంది. అయితే నాలుగేళ్ల క్రితం మొదలైన ఫిషింగ్‌ హార్బర్‌ పనుల ప్రక్రియ మొదలు కావడం లేదు. పూడమడక–సీతపాలెం సరిహద్దులో ఉన్న మొగ వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మించేందుకు 37.3 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ సహజ సిద్ధమైన కొండ పక్క నుంచి ఉప్పుటేరు ప్రవహిస్తోంది. పూడిమడకలోకి వచ్చే బోట్లన్నీ ఈ మొగ ద్వారా ఉప్పుటేరులోకి, ఉప్పుటేరులో నుంచి సముద్రంలోకి వెళ్తాయి. 387 కోట్ల రూపాయల నిధులతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం అనుసంధానం చేసి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం పూర్తి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. పూడిమడక హైస్కూల్‌ పక్క నుంచి హార్బర్‌కు చేరుకునేందుకు పక్కా రోడ్డుని నిర్మించారు.

సాంకేతిక కారణాలతోనే జాప్యం

పూడిమడక వద్ద త్వరలోనే ఫిషింగ్‌ హార్బర్‌ పనులు ప్రారంభం కానున్నాయి. పీపీపీ విధానంలో రూ.700 కోట్లకు పైబడి అంచనా వ్యయంతో పనులు మొదలుకానున్నాయి. సాంకేతిక కారణాలు, పలు రకాల ప్రతిపాదనలతోనే పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతోంది.

–విజయ, జిల్లా మత్స్యశాఖ విభాగ అఽధికారి

ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించనున్న ప్రాంతం

పెరిగిన అంచనా వ్యయం...

పూడిమడక వద్ద నిర్మించనున్న హార్బర్‌ అంచనా వ్యయం అమాంతం పెరిగిపోయింది.నాలుగేళ్ల వ్యవధిలోనే 387 కోట్ల నుంచి 700 కోట్లకు దాటింది.దీని వల్ల ప్రజా ధనం వృథా కావడంతో పాటు,మత్స్యకారులకు కలగాల్సిన తక్షణ న్యాయం జరగకుండా పోయింది.రాష్ట్రంలోనే అతి పెద్ద జాలరిపల్లిగా గుర్తింపు ఉన్న పూడిమడకతో పాటు సమీప ప్రాంతాల మత్స్యకారులకు మేలు చేసే ఫిషింగ్‌ హార్బర్‌ విషయంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని మత్స్యకార నేతలు కోరుతున్నారు. బ్రాండిక్స్‌ పైప్‌లైన్‌ వ్యర్థాలు,ఫార్మా కంపెనీ వ్యర్థాలతో తరచూ ఇక్కడి మత్స్య సంపద మృత్యువాతకు గురవుతోంది. పూడిమడక సముద్రంలో వెళ్లే బోట్లకు ఉపయోగపడే ఉప్పుటేరు కాలుష్య కాసారంగా మారింది.దీంతో ఇటీవల స్థానిక మత్స్యకార బోట్ల యాజమానులు 10 లక్షల రూపాయల సొంత నిధులతో ఉప్పుటేరు శుద్ధీకరణ పనులు చేపట్టుకొని ఆదర్శంగా నిలిచారు. పీపీపీ విధానంలో ఇంకా డీపీఆర్‌ సమర్పించని పూడిమడక ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు మరెప్పుడు ప్రారంభిస్తారని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement