అనకాపల్లి : శిల్పకళ, వాస్తుశాస్త్రం, యంత్ర సాంకేతికతకు ప్రతీక అయిన దేవశిల్పి విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో దేవశిల్పి చిత్రపటానికి గురువారం ఎస్పీ తుహిన్ సిన్హా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మను ప్రపంచ తొలి వాస్తుశిల్పిగా, నిర్మాణ శాస్త్రానికి (ఆర్కిటెక్చర్) ఆద్యుడిగా పురాణాలు అభివర్ణిస్తున్నాయని, ద్వారక వంటి అద్భుత నగరాల నిర్మాణంతో పాటు దేవతల ఆయుధాలు, రథాలను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. శ్రమజీవులందరికీ విశ్వకర్మ స్ఫూర్తిప్రదాత కేవలం దేవతల శిల్పి మాత్రమే కాక, కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడు, శిల్పి, వడ్రంగి, ఇంజినీర్, పారిశ్రామికవేత్త వెనుక ఉన్న నిజమైన ప్రేరణ విశ్వకర్మమేనన్నారు. ఆధునిక సాంకేతికతకు మార్గదర్శకంగా నేటి ఆధునిక యుగంలోనూ ఆయన ప్రదర్శించిన సృజనాత్మకత, నైపుణ్యం ఎంతో ఆచరణీయమని, కష్టపడే తత్వం, అంకితభావం, పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన పనులనైనా అద్భుతంగా సాధించవచ్చనే సందేశాన్ని విశ్వకర్మ జీవితం నేర్పుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, డీఎస్పీ కె.రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
విశ్వకర్మల సేవలు ఎంతో కీలకం : కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల : సమాజ నిర్మాణంలో విశ్వకర్మల సేవలు, నైపుణ్యం ఎంతో విశిష్టమైనవని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. గురువారం భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో విశ్వకర్మల కృషి, నైపుణ్యం, సేవలు ఎంతో విశిష్టమైనవన్నారు. శిల్పకళ, నిర్మాణ రంగం, చేతివృత్తులు రంగాల్లో విశ్వకర్మలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సంప్రదాయ వృత్తులను పరిరక్షించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో వై.సత్యనారాయణ రావు, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి కె.శ్రీదేవి , సహాయ సంక్షేమ అధికారి కె.సుజాత, అధికారులు పాల్గొన్నారు.


