తుమ్మపాల : గడిచిన వారం రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇప్పటివరకు వర్షపాతం లోటు మాత్రం కొనసాగుతోంది. గడిచిన రెండు మూడు రోజులుగా ఉదయం వేళ ఎండలు, సాయంత్రం వేళ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయంత్రం కురుస్తున్న వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యవసాయ పనులకు సైతం వర్షాలు ఊతమిస్తున్నాయి.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి లోటే..
జూన్1 నుంచి ఈ నెల 17 వరకు జిల్లాలో 317.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 587.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 45.9 శాతం లోటు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌లో 97.5 మిల్లీమీటర్లు వర్షం కురవాల్సి ఉండగా 123.2 మిల్లీమీటర్లు, జూలైలో సాధారణ వర్షపాతం 175.9 మిల్లీమీటర్లకు 45.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అలాగే ఆగస్టులో 190.5 మిల్లీమీటర్లకు 86.4 మిల్లీమీటర్లు, ఈ నెల 1 నుంచి 17 వరకు జిల్లాలో 88.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఈ కాలానికి సాధారణ వర్షపాతం 98.2 మిల్లీమీటర్లు కాగా లోటు కేవలం 9.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. దీంతో ఈ నెల వర్షపాతం పరిస్థితి సాధారణ స్థాయికి చేరువగా ఉన్నట్లు అధికారుల గణాంకాలు సూచిస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగితే ఇప్పటివరకు ఉన్న లోటు కొంతమేర పూడ్చే అవకాశం ఉంది.
కశింకోటలో భారీ వర్షం
ఈ నెల 17న జిల్లాలో సగటున 13.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కశింకోట మండలంలో అత్యధికంగా 96.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మునగపాకలో 43.2, అనకాపల్లిలో 38.6, పాయకరావుపేటలో 36.8, యలమంచిలిలో 20.8 మిల్లీమీటర్లు నమోదైంది.
మాడుగులలో 20.2, నాతవరం, చీడికాడలో 13.2 చొప్పున, కె.కోటపాడులో 07, అచ్యుతాపురంలో 6.8, మాకవరపాలెంలో 4.6, దేవరాపల్లిలో 4.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సబ్బవరం 02, ఎస్.రాయవరం 3.4, గొలుగొండ 2.8, రావికమతం, కోటవురట్లలో 1.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
కశింకోటలో అత్యధికం... రావికమతంలో అత్యల్పం..
సాక్షి, అనకాపల్లి : అల్పపీడన ప్రభావంతో గురువారం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. గురువారం ఉదయం నాటికి 24 గంటల వ్యవధిలో జిల్లాలో సగటున 13.2 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో జూన్ నుంచి 587.8 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 317.9 మి.మీ మేరకు 45.9 శాతం లోటులో వర్షాలు కురిశాయి. కశింకోటలో 96.8 మి.మీ, మునగపాకలో 43.2 మి.మీ, అనకాపల్లిలో 38.6 మి.మీ, పాయకరావుపేటలో 36.8 మి.మీ, యలమంచిలిలో 20.8 మి.మీ, మాడుగులలో 20.2 మి.మీ, నాతవరంలో 13.2 మి.మీ, చీడికాడలో 13.2 మి.మీ, కె.కోటపాడులో 7 మి.మీ, అచ్యుతాపురంలో 6.8 మి.మీ, మాకవరపాలెంలో 4.6 మి.మీ, దేవరాపల్లిలో 4.2 మి.మీ, ఎస్.రాయవరంలో 3.4 మి.మీ, గొలుగొండలో 2.8 మి.మీ, సబ్బవరంలో 2 మి.మీ, రావికమతంలో 1.4 మి.మీ, కోటవురట్లలో 1.4 మి.మీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది.


