బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య మృతులిద్దరూ ఇంటర్ విద్యార్థులు పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదని మనస్థాపం బావి వద్ద సూసైడ్ నోట్ లభ్యం
మైనర్ ప్రేమ..
కె.కోటపాడు: తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ఇద్దరు మైనర్లు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కె.కోటపాడులో చోటు చేసుకుంది. పెందుర్తికి చెందిన దుంగల కనిష్క సత్యసాగర్ (16), షీలా అరుణ(16) ఇంటర్ చదువుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి. కనిష్క సత్యసాగర్ తండ్రి రమణ పెందుర్తిలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. వీరిది స్వగ్రామం తుని వద్ద గల వెలమ కొత్తూరు. షీలా అరుణ తండ్రి స్వగ్రామం విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గంగుబూడి గ్రామం. ఈయన కూడా పెందుర్తిలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెందుర్తిలో గల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సమయంలో సత్యసాగర్, అరుణ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంటర్‌కు అరుణను భీమిలి మండలం ఆనందపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆమె తల్లిదండ్రులు చేర్పించారు. సత్యసాగర్‌ను వారి తల్లిదండ్రులు ఎస్.కోటలో గల ప్రైవేట్ కళాశాలలో ఇంటర్‌లో చేర్పించారు. వీరిద్దరూ వేర్వేరు చోట్ల చదువులు సాగిస్తున్నా ప్రేమను కొనసాగించారు. వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో తెలిసింది. ఇరువురి తల్లిదండ్రులు వారి ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించకపోవడంతో వీరిద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఇరువురిని తీసుకువచ్చి పిల్లల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రేమికులిద్దరూ మైనర్‌లు కావడంతో వివాహ వయస్సు వచ్చేంత వరకూ వేచి ఉండాలని సత్యసాగర్, అరుణలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు కె.కోటపాడు పోలీసులు తెలిపారు. అరుణ చదువును తల్లిదండ్రులు మధ్యలోనే ఆపేసి ఆమెను ఇంటి వద్ద ఉంచారు. ఈ నేపథ్యంలో పెందుర్తిలో ఉంటున్న సత్యసాగర్, అరుణ ఇద్దరూ ఈ నెల 15 రాత్రి బయలుదేరి సత్యసాగర్ అమ్మమ్మ ఊరు అయిన కె.కోటపాడుకు వచ్చారు. 16న ఇంటి నుంచి వెళ్లిపోయారు. కె.కోటపాడు సమీపంలో గల పైడమ్మ చెరువు సమీపంలో గల బావిలో గురువారం ఇద్దరి మృతదేహాలు తేలి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను పెందుర్తికి చెందిన కనిష్క సత్యసాగర్, అరుణలుగా గుర్తించారు. బావి వద్ద సత్యసాగర్ రాసిన సూసైడ్ నోట్‌ను వారి తల్లిదండ్రులకు పోలీసులు అందజేశారు. మృతురాలు అరుణ తండ్రి అర్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్ తెలిపారు.


