నక్కపల్లి: ఆషాఢ శుద్ధ ఏకాదశి(తొలి ఏకాదశి) పూజలను శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వేకువజామున మూడు గంటలకు గరుడాద్రిపై స్వామి వారి మూల విరాట్‌కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. సాయంత్రం గరుడాద్రి చుట్టూ శ్రీనివాస్ భక్త సమాజం వారితో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అర్చకులు వరప్రసాద్ ఆచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారిని తహసీల్దార్ చిన్ని కృష్ణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ తదితరులు దర్శించుకున్నారు. సీఐ మురళి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కోలాటం నిర్వహించారు.
ఉపమాకకు పోటెత్తిన భక్తులు


