మాడుగుల రూరల్/గొలుగొండ: ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఒక వైపు వరినారు పోసి ఎండిపోకుండా అష్టకష్టాలు పడి నీరు తడుపుతూ కాపాడుకుంటున్నారు. మరోవైపు వర్షాలు కురిస్తే విత్తనాలు వేద్దామని మరికొందరు రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వానలు కురవాలని పలు గ్రామాల్లో స్థానికుంతా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గురువారం మాడుగుల మండలం కె.జె.పురం మునసీబు కళ్లాలు వద్ద వేపచెట్టు కింద బోగుండమ్మ అమ్మవారికి పసుపు కుంకుమతో పూజలు చేశా రు. అనంతరం వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు. అదేవిధంగా గొలుగొండ మండలం చీడిగుమ్మలలో మహిళలు కిలోమీటరు మేర ఉన్న గ్రామ పొలిమేర వరకు జలాభిషేకం చేస్తూ వర్షాలు కురవాలని మొక్కుకున్నారు. గ్రామంలో అమ్మవారి ఆలయాలతోపాటు స్థానిక శివాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయాల్లో రైతులు, మహిళలు ప్రత్యేక పూజలు


