జగన్‌ 2.0 యాప్‌తో కూటమి అరాచకాలను బయటపెడదాం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ 2.0 యాప్‌తో కూటమి అరాచకాలను బయటపెడదాం

Jul 23 2026 12:30 AM | Updated on Jul 23 2026 12:30 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

అనకాపల్లి: జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌తో కూటమి ప్రభుత్వ అరాచకాలను బయటపెడదామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక రింగ్‌రోడ్డులోని నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ కార్యాలయంలో బుధవారం ఆయన యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, గ్రామీణ స్థాయి నుంచి కూటమి ప్రభుత్వ అరాచకాలను యాప్‌లో నమోదు చేస్తే, అది మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్తుందని చెప్పారు. యాప్‌లో పార్టీకి సంబంధించిన సమస్యలు, కూటమి అక్రమాలు నమోదు చేయాలని సూచించారు. చలో పంచదార్ల కార్యక్రమానికి విశాఖ ఉమ్మడి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివెళ్లడంతో ప్రభుత్వం దిగివచ్చి, ఫణిగిరి కొండ ప్రాంతాన్ని ’నో మైనింగ్‌ జోన్‌’గా పేర్కొంటూ డీఆర్‌సీ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు.

నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ మాట్లాడుతూ... కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను పార్టీ సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంటే ప్రభుత్వం వీడియోలను డిలీట్‌ చేసి, అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు, కూటమి అరాచకాలను యాప్‌లో నమోదు చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్నంతా అమరావతి పేరుతో దోచుకుంటోందని ఆరోపించారు.

మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ... రాష్ట్రంలో సోషల్‌ మీడియాను అణిచివేసేందుకు ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతోందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్‌సీపీ పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నారు. జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ద్వారా ఇప్పటికే 15 లక్షల మంది తమ సమస్యలను నమోదు చేశారని తెలిపారు. నియోజకవర్గ పరిశీలకుడు పి.సతీష్‌ వర్మ మాట్లాడుతూ... ఈ యాప్‌ వల్ల ప్రజలకు, కార్యకర్తలకు మేలు జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో బొజ్జన్నకొండను పురావస్తుశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తే, కూటమి పాలనలో బొజ్జన్నకొండ వైపు వెళ్లే రహదారి శిథిలావస్థకు చేరిందన్నారు. రైల్వేశాఖ తమ ఆస్తులను కాపాడుకునేందుకు విజయరామరాజుపేట అండర్‌ బ్రిడ్జి వద్ద రహదారికి ఇరువైపులా పెద్ద పెద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసిందని, దీనివల్ల ప్రతిరోజూ 10 నుంచి 15 మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఉగ్గిన అప్పారావు, 80, 81, 84 వార్డుల ఇన్‌చార్జ్‌లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, అనకాపల్లి, కశింకోట మండలాల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్‌, మలసాల కిషోర్‌, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్‌ కొణతాల మురళీకృష్ణ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గొల్లవిల్లి శ్రీనివాసరావు, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ కరక సోమునాయుడు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, అనకాపల్లి, కశింకోట మహిళా మండల అధ్యక్షురాళ్లు పద్మకుమారి, తగరంపూడి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement