సమాచారం వచ్చిందెప్పుడు..? | - | Sakshi
Sakshi News home page

సమాచారం వచ్చిందెప్పుడు..?

Jul 9 2026 6:59 AM | Updated on Jul 9 2026 6:59 AM

● ప్రమాదంపై పొంతనలేని ప్రభుత్వ వాదనలు ● సమాచారం ఉన్నా సహాయక చర్యల్లో జాప్యం? ● పరిహారంలోనూ మత్స్యకారుల పట్ల

వివక్షేనంటున్న జాలర్లు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

ముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రమాద సమాచారం ఎప్పుడు అందింది? గాలింపు చర్యలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అనే అంశాల్లో అధికారుల ప్రకటనలే పరస్పర విరుద్ధంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందినా వెంటనే స్పందించకపోవడం వల్లే ప్రాణనష్టం పెరిగిందని మత్స్యకార కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

కలెక్టర్‌కు ముందే సమాచారం

ప్రమాదం ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నమే జరిగినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు మత్స్యకార సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరాం జిల్లా కలెక్టర్‌కు వాట్సాప్‌, సందేశం ద్వారా ప్రమాద సమాచారాన్ని పంపించారు. కలెక్టర్‌ స్పందించినప్పటికీ సహాయక చర్యలు మాత్రం మరుసటి రోజు ఉదయం వరకు ప్రారంభం కాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

18 గంటల ప్రాణపోరాటం

ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు రాత్రి 9 గంటల వరకు బోటుపైనే సహాయం కోసం ఎదురుచూశారు. అనంతరం సముద్రంలోకి దిగి ప్రాణాల కోసం ఈదుతూ పోరాడారు. దాదాపు 18 గంటల పాటు ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే గాలింపు ప్రారంభించి ఉంటే చిన్నతో పాటు మరింత మంది ప్రాణాలతో బయటపడే అవకాశముండేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెలికాప్టర్‌ ఎక్కడ..?

ప్రమాదం జరిగిన రాత్రే హెలికాప్టర్‌తో గాలింపు చేపట్టామని అధికారులు చెబుతున్నారని, కానీ వాస్తవంగా అలాంటి చర్యలు కనిపించలేదని మత్స్యకారులు అంటున్నారు. సహాయక చర్యలు ఆలస్యం కావడంతోనే పరిస్థితి విషాదంగా మారిందని వారు ఆరోపిస్తున్నారు.

రూ.10 లక్షలతో చేతులు దులుపుకున్నారా?

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల పరిహారం ఏమాత్రం సరిపోదని జాలర్లు అంటున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి దీర్ఘకాలిక భరోసా, ఉపాధి, పిల్లల చదువుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

’బోటుకు ఇచ్చిన విలువ.. ప్రాణానికి లేదా?’

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైనప్పుడు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక సాయం అందించిందని మత్స్యకారులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రాణనష్టం జరిగినా అదే స్థాయి స్పందన కనిపించడం లేదని, బోటుకు ఇచ్చిన విలువ కూడా మత్స్యకారుడి ప్రాణానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ ఇదే తీరు..!

మత్స్యకారుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాలర్లు ఆరోపిస్తున్నారు. 2024లో మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేయలేదని, అనంతరం విడుదల చేసిన భరోసా మొత్తాన్ని కూడా సగానికి తగ్గించారని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో అర్హులైన మత్స్యకారులకు భరోసా అందలేదని చెబుతున్నారు. అలాగే, 2025 అక్టోబరులో సముద్రంలో దారి తప్పి బంగ్లాదేశ్‌ జలాల్లోకి వెళ్లిన 23 మంది మత్స్యకారులను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది పశ్చిమ బెంగాల్‌కు, తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించలేదని మత్స్యకారులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నుంచి చొరవ లేకపోవడంతో మత్స్యకార సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరాం స్వయంగా బంగ్లాదేశ్‌కు వెళ్లి వారి విడుదల కోసం ప్రయత్నించారని పేర్కొంటున్నారు. చివరకు 2026 జనవరిలో మత్స్యకారులు విడుదలై స్వదేశానికి చేరుకోగా, అప్పటివరకు స్పందించని ప్రభుత్వం చివరి దశలో మాత్రం ప్రచారం చేసుకుందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement