అంతా గందరగోళం ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

అంతా గందరగోళం ‘సర్‌’

Jul 9 2026 6:11 AM | Updated on Jul 9 2026 6:11 AM

మునగపాక: మండల వ్యాప్తంగా సర్‌ ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. ఎన్యుమరేషన్‌ గడువు సమీపిస్తుండడంతో ఓటర్లు బీఏల్‌వోలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు తీసుకొని అప్‌లోడ్‌ చేయించాల్సి ఉన్నా పలు చోట్ల బీఏల్‌వోలు కార్యాలయాల వద్ద సర్‌ కార్యక్రమం నిర్వహించడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు 2002 సంవత్సరానికి సంబంధించిన జాబితాలు అందుబాటులో లేకపోవడంతో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఈ నెల 14వ తేదీలోగా గడువు పూర్తికావచ్చిన సందర్భంలో పనులు మాత్రం ఆశించిన మేర జరగకపోవడంతో అధికారులు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఉన్నతాధికారుల నుంచి సర్‌ వేగవంతం చేయాలంటూ పదేపదే ఒత్తిళ్లు పెరిగిపోవడంతో బీఎల్‌వోలు పడరాని పాట్లు పడుతున్నారు. బీఎల్‌ఏల సహకారం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో పనులు ఆశించిన మేర జరగడం లేదనే చెప్పాలి.

సర్‌ నమోదులో తప్పులు చేస్తే

చర్యలు తప్పవు: జేసీ

కశింకోట: ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని, తప్పులు చేస్తే చర్యలు తీసుకోవలసి వస్తుందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ హెచ్చరించారు. కశింకోటలో సర్‌ కార్యక్రమంపై బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ఓటర్ల పేర్లు, వివరాలు నమోదులో తప్పులు చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల పేర్లు, వివరాలు తప్పులు లేకుండా ముందస్తుగా సర్వేలో నమోదు చేస్తే తర్వాత నోటీసులు ఇవ్వడం, వాటిని సవరించుకునే అవసరం తగ్గుతుందన్నారు. గడువులోగా సర్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతి ఓటరు వివరాలను 2002 ఓటర్ల జాబితాతో సరి పోల్చి వివరాలను సమగ్రంగా తెలుసుకొని నమోదు చేయాలన్నారు. తహసీల్దార్‌ భాస్కర అప్పారావు, రెవెన్యూ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement