లేనట్లేనా!
● దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు సిద్ధం
● డెక్ భవనంలో జూన్ 1 నుంచి తాత్కాలిక కార్యకలాపాలు మొదలు
● అధికారులకు విధుల కేటాయింపు షురూ
● సిబ్బందికి తగ్గ విస్తీర్ణం లేకపోవడంతో ఇబ్బందులు
● రెండు షిఫ్టుల్లో పని చెయ్యించాలని నిర్ణయం
● ఉద్యోగుల బదిలీల్లో ఇబ్బందులపై చర్చలు
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యకలాపాలు మొదలవ్వడానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముహూర్తం ప్రకారం జూన్ 1 నుంచి జోన్ వ్యవహారాలు ప్రారంభం కావాల్సి ఉన్నా, ఆశించిన స్థాయిలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ, తాత్కాలికంగా ఎంపిక చేసిన డెక్ భవనంలోనే ఈ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అయితే ఉద్యోగుల కేటాయింపుల విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చెయ్యాలంటూ బుధవారం సాయంత్రం జరిగిన సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జోన్ల జీఎంలకు రైల్వే బోర్డు కఠిన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాత్కాలిక కార్యాలయంలో అనుకున్నంత స్సేస్ లేకపోవడంతో విధుల్లో చేరే సిబ్బందికి ఇబ్బందులు తప్పవని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. –సాక్షి, విశాఖపట్నం
కొత్త జోన్ తాత్కాలిక ఆఫీసు కోసం విశాఖలోని డెక్ భవనంలో 6, 7 అంతస్తులను రెండేళ్ల కాలపరిమితికి రైల్వే శాఖ అద్దెకు తీసుకుంది. రెండూ కలిపి సుమారు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యాలయ సముదాయానికి అన్ని నిర్వహణ ఖర్చులతో కలిపి నెలకు సుమారు రూ.40 లక్షల భారీ అద్దెను చెల్లిస్తున్నారు. అయితే జోనల్ స్థాయి అధికారులకు, ఇక్కడకు వచ్చే సిబ్బంది సంఖ్యకు తగినట్లుగా ఈ స్థలం ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ స్థల లేమిని అధిగమించేందుకు, సిబ్బందితో రెండు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేలా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు.
ఉద్యోగుల బదిలీలపై కొలిక్కిరాని కసరత్తు
కొత్త జోన్ ఏర్పాటులో ఉద్యోగుల కేటాయింపు, బదిలీల ప్రక్రియ పెద్ద సమస్యగా మారింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు దక్షిణ కోస్తా, దక్షిణమధ్య, తూర్పు కోస్తా రైల్వే జోన్ల జీఎంలు, విశాఖపట్నం, రాయగడ, డివిజన్ల డీఆర్‌ఎంలతో రైల్వే బోర్డు బుధవారం రాత్రి సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సిబ్బంది సర్దుబాటులో కచ్చితంగా సీనియారిటీని ప్రాధాన్యతగా తీసుకోవాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే విశాఖ, రాయగడ ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు కొందరు సిబ్బంది సుముఖత చూపడం లేదు. అవతలి జోన్ల వారు విశాఖ వచ్చేందుకు నిరాకరిస్తూ, గతంలో ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను వెనక్కి తీసుకోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. వీటిని పరిష్కరించేందుకు అధికారుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. బదిలీలకు స్వచ్ఛందంగా ఇష్టపడే వారిని ముందే సర్దుబాటు చేయాలని వీసీలో నిర్ణయించారు. దీనివల్ల ఖాళీల సంఖ్యలో మార్పు ఉండదని, ఇష్టపడిన వారికి సీనియారిటీ ప్రకారం అవకాశం దక్కుతుందని బోర్డు భావిస్తోంది. ఉద్యోగుల కేటాయింపులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని బోర్డు ఆదేశించింది.
ప్రారంభోత్సవం
ప్రజల కోసం కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించే యోచనలో రైల్వే శాఖ ఉంది. గతంలో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తరుణంలో ఈ రైలును విశాఖ నుంచే ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని అమరావతి కావడంతో, అక్కడి నుంచి న్యూఢిల్లీకి వయా విశాఖ మీదుగా దీనిని నడపాలని ప్రాథమికంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏపీ వ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే ఉద్దేశంతో కొండపల్లి వరకు కవర్ చేస్తూ సౌత్ సెంట్రల్ పరిధిలోకి వెళ్లేలా మార్గాన్ని డిజైన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక రైలు పట్టాలెక్కేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, జూన్ 1న ఇది ప్రారంభమయ్యే సూచనలు లేవని రైల్వే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
జూన్ 1న కొత్త జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతున్నప్పటికీ, దీనిపై ఎలాంటి అధికారిక వేడుకల మార్గదర్శకాలు రైల్వే బోర్డు నుంచి రాలేదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ అధికారులకు ఎలాంటి అధికారిక సమాచారం అందకపోవడంతో ఆర్భాటాల్లేకుండా సాధారణంగానే కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతు న్నారు. శుక్రవారంలోపు ఏవైనా కొత్త ఆదేశాలు వస్తే దానికనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని, లేదంటే 1వ తేదీన ఆర్భాటాల్లేకుండానే విధులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.


