కోర్టు స్థలం ‘టీడీపీ’ ఆఫీసుకు ధారాదత్తం?
కలెక్టర్ ఆదేశాలపై అనకాపల్లి ప్రజలు, న్యాయవాదుల తీవ్ర ఆగ్రహం
తుమ్మపాల రెవెన్యూ పరిధిలో డంపింగ్ యార్డు స్థలంపై అధికార పార్టీ కన్ను
ఈ స్థలాన్ని న్యాయ సముదాయానికి కేటాయించిన తొలి కలెక్టర్ రవిపట్టాన్ శెట్టి
ఆ నిర్ణయానికి ప్రస్తుత కలెక్టర్ తూట్లు
ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటే.. పార్టీ ఆఫీసుకు ల్యాండా.?
ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు, ప్రజల డిమాండ్
కూటమి పాలనలో
సాక్షి, అనకాపల్లి : జిల్లాలో టీడీపీ కార్యాలయం ఏర్పాటుకు చేసిన భూ కేటాయింపుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రజల అవసరాలు, న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని, అధికార పార్టీ కార్యాలయానికి ధారాదత్తం చేయడంపై స్థానిక ప్రజలు, న్యాయవాదులు మండిపడుతున్నారు. న్యాయ స్థానాల సముదాయం (కోర్టు కాంప్లెక్స్) కోసం గతంలో కలెక్టర్ కేటాయించిన స్థలాన్ని రద్దు చేస్తూ, అక్కడ టీడీపీ ఆఫీసు నిర్మాణానికి ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.
తొలి కలెక్టర్ నిర్ణయానికి తూట్లు..
అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత నియమితులైన తొలి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి జిల్లా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మపాల గ్రామ రెవెన్యూ పరిధిలోని సుమారుగా 2 ఎకరాల డంపింగ్ యార్డు స్థలాన్ని న్యాయ స్థానాల సముదాయం (కోర్టుల) ఏర్పాటు కోసం కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు, ఇక్కడికి వచ్చే కక్షిదారులకు ఎంతో అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ స్థలాన్ని అప్పటి కలెక్టర్ రవిపట్టాన్ శెట్టి పరిశీలన చేసి న్యాయ స్థాన సముదాయానికి అనుకూలమైన స్థలంగా నిర్ణయించినట్టు లాయర్లు వెల్లడిస్తున్నారు. కానీ, ప్రస్తుత కలెక్టర్ విజయకృష్ణన్‌ఆ ఉత్తర్వులను పక్కన బెట్టి, అదే స్థలాన్ని అధికార టీడీపీ కార్యాలయానికి కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కన బెట్టి, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందని స్థానికులు, న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు..!
జిల్లా ఏర్పడి ఇన్నాళ్లవుతున్నా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు వివిధ కీలక ప్రభుత్వ విభాగాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని అద్దెలుగా చెల్లించలేక ప్రభుత్వం, అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. సొంత ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థలాలు వెతకాల్సిన అధికార యంత్రాంగం..అవన్నీ వదిలేసి అధికార పార్టీ ఆఫీసు కోసం అంతటి విలువైన భూమిని ఎలా కేటాయిస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను వదిలేసి, పార్టీ ఆస్తులను పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపిస్తున్నారు.
ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
‘కోర్టుల కోసం కేటాయించిన భూమిని ఒక రాజకీయ పార్టీకి ఇవ్వడం అత్యంత దుర్మార్గం. ప్రస్తుత కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. టీడీపీ కార్యాలయ స్థల కేటాయింపును రద్దు చేయాలి. లేని పక్షంలో న్యాయవాదులు, ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం. జిల్లా కలెక్టర్ ఇప్పటికై నా స్పందించి, ఈ వివాదాస్పద ఆదేశాలను తక్షణమే రద్దు చేసి, సదరు స్థలాన్ని యథావిధిగా న్యాయ స్థానాల సముదాయానికే కేటాయించాలని జిల్లా ప్రజలు, న్యాయవాద సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి.
– కనిశెట్టి సురేష్‌బాబు, ప్రజారాజకీయ వేదిక కన్వీనర్, ప్రముఖ న్యాయవాది


