కరుణ లేని యంత్రాంగం.. ఎన్నాళ్లీ మోత భారం | - | Sakshi
Sakshi News home page

కరుణ లేని యంత్రాంగం.. ఎన్నాళ్లీ మోత భారం

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

దేవరాపల్లి : మండలంలోని గరిశింగి పంచాయతీ శివారు కించుమండ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు కంచర శ్రీను గురువారం సాయంత్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎత్తయిన కొండపైన ఉన్న కించుమండకు రోడ్డు సౌకర్యం లేక పోవడంతో గ్రామస్తులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ యువకుడిని చేతులపై మోసుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు. మధ్య మధ్యలో బండరాళ్లపై కొద్ది సేపు సేద తీరుతూ సుమారు ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన సమీప గ్రామమైన డొర్ర చెరువు వరకు అతి కష్టం మీద తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రైవేటు వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మైదాన ప్రాంత గిరిజనులకు సైతం డోలీ మోతలు, చేతులపై మోసుకెళ్లాల్సిన పరిస్థితులు తప్పడం లేదని కించుమండ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే పలుమార్లు తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా ఫలితం శూన్యమన్నారు. తమ గ్రామస్తులు అనారోగ్యం బారిన పడిన సందర్భంలో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని, ఇప్పటికై నా పాలకులు స్పందించి తమ గ్రామ రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని వేడుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement