ప్రజా సమస్యల పరిష్కారానికి
తుమ్మపాల : ప్రజా సమస్యలను శీఘ్రగతిన పరిష్కారం, రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనలు‘ కార్యక్రమాన్ని చోడవరంలో శుక్రవారం ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జిల్లాలోని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఎంపిక చేసామని, మాధవ ఫంక్షన్ హాల్, కొత్తూరు జంక్షన్ చోడవరంలో జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి అర్జీలు మిగిలి ఉండకుండా, పూర్తిగా సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రజల ఫిర్యాదుల పరిష్కార సేవలను వారి ఇంటి వద్దకే చేర్చడం, ప్రజల నుండి వచ్చే గ్రీవెన్స్‌ను (ఫిర్యాదులను) కేవలం ఒక్క నెల వ్యవధిలోనే పరిష్కరించడం, ఒకే సమస్యపై ప్రజలు పదేపదే అర్జీలు పెట్టుకునే అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం, కోర్టు వివాదాలను తగ్గించడం, సంతృప్త పద్ధతిలో రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా మార్చడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ పరిపాలనపై పౌరుల్లో నమ్మకాన్ని, సంతృప్తిని పెంపొందించడం జరుగుతుందన్నారు. చోడవరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, వివిధ శాఖలకు చెందిన వారు తమ సమస్యలు, ముఖ్యంగా రెవెన్యూ ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు.


