క్‌తో
మాడుగుల రూరల్ : సాధారణంగా పాములంటే మనిషికి హడల్. ఆ భయంతోనే వాటిని విచక్షణా రహితంగా చంపేస్తుంటారు. అటువంటి విషపూరిత పాములను స్నేక్ కేచర్ సహాయంతో పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టడం, అవసరమైతే చికిత్సలు అందించడం చేస్తూ వాటి సంరక్షణకు పాటుపడుతున్నారు కొందరు పశువైద్యులు. సర్ప వైద్యం, వైల్డ్ లైఫ్ మెడిసినల్ విధానంలో మండలంలో పనిచేస్తున్న ముగ్గురు పశువైద్యులు వన్య ప్రాణుల సంరక్షణ మిషన్‌తో పాములకు రక్షకులుగా మారారు. కరుణ, ధైర్యం, అంకిత భావానికి స్ఫూర్తిదాయకంగా విష జంతువులకు హాని చేయకుండా నివారిస్తూ చికిత్సలు చేస్తున్నారు.
స్నేక్ క్యాచర్ సాయంతో...
మండలంలో పశువైద్యాధికారులు శివకుమార్, సుదీప్, శివప్రసాద్ సర్పవైద్యంతో వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తున్నారు. మాడుగులకు చెందిన స్నేక్ కేచర్ వెంకట్ కింగ్ కోబ్రా వంటి హానికరమైన పాములను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. కింగ్ కోబ్రా అంతరించిపోతున్న జాతులలో ఒకటి. అందువల్ల అటువంటి పాములను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని వైద్యాధికారి శివకుమార్ చెబుతున్నారు. మన పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే ఫారెస్టు అధికారికి సమాచారం అందిస్తే, వెంటనే రెస్క్యూ చేసి అటవీ ప్రాంతాల్లో విడిచిపెడతారని తెలిపారు. పాములు అనేవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, పాములకు దెబ్బలు తగలితే ఆర్దోఫెడిక్స్, ఇతర అధునాతన శస్త్ర చికిత్సలు 60 వరకు రెండు సంవత్సరాల వ్యవధిలో చేపట్టామని వైద్యాధికారి శివకుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన పశువైద్య సర్జన్లు పెంపుడు జంతువులకు మించి తమ సేవలను ముఖ్యంగా పాములను రక్షించడానికి విస్తరించారు.
భయం పోగొట్టేలా...
విష జంతువుల పట్ల జనంలో భయం పొగొట్టడానికి శాసీ్త్రయ పద్ధతులను ఉపయోగించడం, పర్యావరణ సమతుల్యత గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే వాటి వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా వాటి సహజ ఆవాసాలలోకి సురక్షితంగా మార్చబడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కోబ్రా రెస్క్యూ ఆపరేషన్‌లో చాలా సంవత్సరాల నైపుణ్యం ఉన్న మాడుగుల గ్రామానికి చెందిన పాము క్యాచర్ వైల్డ్ వెంకట్ దీనికి బలంగా మద్దతునిస్తున్నారు. సవాలుతో కూడిన రెస్క్యూ ఆపరేషన్‌లో పశువైద్యులకు తోడ్పాటు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. పశువైద్యులతో సమన్వయం చేసుకుని అనేక పాములను రక్షించడంలో సహాయ పడుతున్నారు. ప్రజల్లో ఆయా విష జంతువుల పట్ల భయం పోగొడుతున్నారు.
కె.జె.పురం పశువైద్యశాలలో పాముకు శస్త్ర చికిత్స చేస్తున్న పశువైద్యాధికారి డాక్టర్ శివకుమార్
పామును చాకచక్యంగా పట్టుకుంటున్న స్నేక్ కేచర్ వెంకట్
విషప్రాణులకు ప్రాణదాతలు
శస్త్ర చికిత్సలతో పాములకు రక్షణ
పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న వైనం
సర్పవైద్యుల స్ఫూర్తిదాయక సేవలు
వన్య ప్రాణులను రక్షించాలి
వన్య ప్రాణుల సంరక్షణ చట్టం అమలులో భాగంగా విష జంతువులను పూర్తిగా సంహరించకూడదు. ప్రజలకు ప్రాణహాని ఉందని, వీటిని సంహరిస్తున్నారు.స్నేక్ కేచర్ సహాయంతో రెండు సంవత్సరాల వ్యవధిలో 60 పాములకు శస్త్ర చికిత్సలు నిర్వహించాం. పశు వైద్యశాలల్లో ఈ చికిత్సలు నిర్వహించాం.
– కె. శివకుమార్, పశువైద్యాధికారి, కింతలి వల్లాపురం, మాడుగుల మండలం
స్ఫూర్తిదాయకం
స్నేక్ కేచర్ వెంకట్ ఎన్నో విష జంతువులను పొలాల్లో, ఇళ్ల వద్ద చాకచక్యంగా పట్టుకుని, వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెడుతున్నారు. ఆయన సేవలు ప్రశంసనీయం. వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం పశువైద్యాధికారుల సేవలు ప్రశంసనీయం.
– శోలం రమేశ్, మాజీ సర్పంచ్ శంకరం గ్రామం, మాడుగుల మండలం


