అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకుంటున్న గ్రామస్తులు
మునగపాక: మండలంలోని పాటిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ చెరువు నుంచి మట్టి అక్రమ తరలింపును గురువారం రాత్రి స్థానికులు అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారని తెలుసుకున్న స్థానికులు మట్టి లారీలను పట్టుకొని అడ్డగించారు. అక్రమార్కులు రాత్రుల సమయంలో మట్టిని తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మట్టి తరలింపునకు సంబంధించి అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా సమీపంలోని ఇటుక బట్టీలకు మట్టిని తరలించుకుపోతున్నారు. విషయం తెలుసుకున్న పాటిపల్లికి చెందిన పలువురు మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మట్టి తరలింపునకు అనుమతులు ఎవరిచ్చారని లారీ డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చెరువులు, కాలువల్లో మట్టి అక్రమ తరలింపును నిరోధించాలని లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామంటూ స్థానికులు హెచ్చరించారు.


