విశాఖలో ‘విష’వలయం | - | Sakshi
Sakshi News home page

విశాఖలో ‘విష’వలయం

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

నగరంలో కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలు

ప్రతి 10 రోజుల్లో 7 రోజులు అత్యంత విషవాయువులే పీల్చుతున్న ప్రజలు

ప్రాణాలు తోడేస్తున్న పరిశ్రమలు, వాహనరద్దీ

రైస్పెరర్‌ లివింగ్‌ సైన్సెస్‌ సంస్థ పరిశోధనల్లో వెల్లడి

వాతావరణంపై నెపం నెట్టేసి చేతులు దులిపేసుకుంటున్న ప్రభుత్వం

సాక్షి, విశాఖపట్నం: అందమైన సాగరతీరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అంటూ విశాఖపట్నం గురించి గొప్పగా చెప్పుకోవడం ఇక గతమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం అబ్బే.. ఇదంతా వాతావరణానిదే తప్పంటూ చేతులు దులిపేసుకుంటోంది. ఈ ఏడాది నగర పరిధిలో ప్రతి 10 రోజుల్లో 7 రోజుల పాటు ప్రజలు విషవాయువులే పీల్చుతున్నారంటూ రైస్పెరర్‌ లివింగ్‌ సైన్సెస్‌ సంస్థ తన పరిశోధనల్లో వెల్లడించింది. మూడేళ్ల కాలంలో ఈ ప్రమాదకరమైన పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పరిశ్రమలు, వాహనాల కారణంగా కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నా..ఏపీపీసీబీ అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు.

భయపెడుతున్న గణాంకాలు..!

రైస్పెరర్‌ లివింగ్‌ సైన్సెస్‌ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాలు విశాఖ కాలుష్య తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. 2024 నుంచి 2026 వరకు పరిశీలిస్తే, రాష్ట్రంలోనే అత్యంత కలుషితమైన ప్రాంతాల్లో జీవీఎంసీ మానిటరింగ్‌ స్టేషన్‌ వరుసగా మూడేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. 2026 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 70.68 శాతం రోజుల్లో గాలిలోని ప్రమాదకర ధూళి కణాలు (పీఎం10) భద్రతా ప్రమాణాలను దాటేశాయి.

పరిశ్రమలు, వాహనాల కాలుష్యమూ ఎక్కువే.!

వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర నైట్రోజన్‌ డయాకై ్సడ్‌ స్థాయిలు కూడా రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 34 శాతం మేర పెరిగాయి. నైట్రోజన్‌ డయాకై ్సడ్‌ వార్షిక సురక్షిత పరిమితి 40 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్లు కాగా.. ఇది 2024లో 35.25గా ఉండగా.. ఈ ఏడాది ఏకంగా 47.41కి చేరుకొని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

రాష్ట్ర సగటు కంటే దారుణంగా..!

రాష్ట్రం మొత్తం మీద పీఎం10 సగటు 84 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్లు ఉంటే, ఒక్క విశాఖలో 139.59గా ఉంది. నైట్రోజన్‌ డయాకై ్సడ్‌(ఎన్‌వో2) సగటు కేవలం 23 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్లు కాగా, విశాఖలో అది ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా 47.41 గా నమోదైంది.

వాటివల్లే ఎక్కువ కాలుష్యం.!

విశాఖలో ఈ కాలుష్య విలయానికి ఏ ఒక్కటో కారణం కాదని.. సంస్థ పరిశోధనల్లో స్పష్టం చేసింది. ముఖ్యంగా విశాఖలో విస్తరించి ఉన్న పరిశ్రమలు, పోర్టులు, పెరుగుతున్న వాహన రద్దీ కలగలిసి ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. అత్యంత జనసాంద్రత గల ప్రాంతంలోనే ఈ భారీ పరిశ్రమలుండటం, దానికి తోడు వాహనాల రద్దీ తోడవడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటమే విశాఖ విషతుల్యం కావడానికి కారణమని గణాంకాలు చెబుతున్నాయి.

ఏడాదిలో సగానికి పైగా రోజులు విషవాయువులే

విశాఖ ప్రజలు ఏడాదిలో సగానికి పైగా రోజులు విషవాయువులనే పీలుస్తున్నారని మా పరిశోధనల్లో స్పష్టమైంది. కాలుష్య కారకాలైన పరిశ్రమలను జవాబుదారీ చేసేలా కఠినమైన ప్రణాళిక, అమలు అవసరం. కాలుష్య నియంత్రణకు శాసీ్త్రయ అధ్యయనాలు, నిర్దిష్టమైన పారిశ్రామిక ఉద్గార నియంత్రణ లక్ష్యాలు అత్యవసరం. కార్సినోజెనిక్‌ వాయువులతో పాటు గతంతో పోలిస్తే.. ధూళి కణాలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. చెట్లు పెంచడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.

–రోనక్‌ సుతారియా, రైస్పెరర్‌ లివింగ్‌ సైన్సెస్‌ సంస్థ సీఈవో

నగరంలో కాలుష్య పరిస్థితులు

పీఎం 2.5 పరిస్థితి మరింత దారుణం.!

ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయే అతి సూక్ష్మ కణాల (పీఎం2.5) పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. పీఎం 2.5 సురక్షిత వార్షిక పరిమితి 40 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్లు కాగా.. ఇది 2024లో 45.14 ఉండగా.. 2025లో 51.68, 2026లో 47.66 గా నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement