రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో వెంకటేష్, కల్యాణ్‌రామ్ సినిమా
సినీ దర్శకుడు అనిల్ రావిపూడి
అప్పన్న సన్నిధిలో సినిమా స్క్రిప్ట్‌కు పూజలు
సింహాచలం: వెంకటేష్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో తాము తీయబోయే కొత్త సినిమాతో ముచ్చటగా మూడవసారి 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సినిమా స్క్రిప్ట్‌ను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అనిల్ రావిపూడి పేరిట అర్చకులు స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ జరిపించి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఏఈవో శ్రీనివాసరావు ఆయనకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను బహూకరించారు.
సంక్రాంతి సెంటిమెంట్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్!
దర్శనానంతరం అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ తనకు ఎంతో కలిసొచ్చే సెంటిమెంట్ అని తెలిపారు. గతంలో 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఆ తర్వాత 2026లో ‘సంక్రాంతికి మన శంకరవరప్రసాద్’ సినిమాలు విడుదలై సూపర్‌డూప్ హిట్‌గా నిలిచాయని గుర్తుచేశారు. అదే జోష్‌తో ఈసారి కూడా 2027 సంక్రాంతి పండుగకు వరుసగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామన్నారు. పూర్తి కామెడీ, కుటుంబ నేపథ్యంతో పాటు రాయలసీమ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
స్క్రిప్ట్‌లన్నీ వైజాగ్‌లోనే..
తాను తీసిన తొలి చిత్రం ‘పటాస్’ నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారని అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపారు. తనకు విశాఖపట్నం అంటే ఎంతో ఇష్టమని, తాను తీసే ప్రతి సినిమాకు విశాఖలోనే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటానని వెల్లడించారు. స్వామివారి దర్శనంలో ఆయన వెంట కథా రచయిత ఎస్.కృష్ణ, సింహాచలం ప్రాంతానికి చెందిన ఇందు రమణ తదితరులు ఉన్నారు.


