మహారాణిపేట: కేజీహెచ్‌ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు లాభం చేకూర్చేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తించడం సిగ్గుచేటని సీఐటీయూ సీనియర్ నాయకుడు వై.రాజు ధ్వజమెత్తారు. కేజీహెచ్‌లో రోగులకు సరిపడ మందులు ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా కేజీహెచ్‌లో మందులు, మౌలిక వసతులపై దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు. గూగుల్ లాంటి పరిశ్రమలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య ప్రదాయిని అయిన కేజీహెచ్‌కు నిధులు ఇవ్వకుండా దారుణమన్నారు. కేజీహెచ్‌లో మందుల కొరతతో పాటు వైద్యులు, నర్సులు, సిబ్బంది కొరతతో రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అధునాతన పరికరాలు పాడైతే మరమ్మతులు కూడా చేయడం లేదన్నారు. రోగులకు సెల్‌ఫోన్లు లేవన్న సాకుతో ఎక్స్‌రేలు తీయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కేజీహెచ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మందులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.నరసింగరావు, గణేష్, రమణ, బంగారునాయుడు, రాంబాబు, సూరాడ శ్రీను, ఆటో శ్రీను, నరసింహ, ఎం.సుబ్బారావు, వై.వై.రాజు, కర్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


