అత్తపై కర్రతో కోడలు దాడి | - | Sakshi
Sakshi News home page

అత్తపై కర్రతో కోడలు దాడి

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

● గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అత్త మృతి

చోడవరం : అత్తపై కోడలు దాడి చేయడంతో అత్త మృతిచెందిన సంఘటన వెంకన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. మండలంలోని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పసలమ్మ (46), తన కోడలు కరక నాగమణి మధ్య బుధవారం చిన్నపాటి వివాదం జరిగింది. ఈ గొడవలో అత్తపై ఆవేశంతో విచక్షణారహితంగా కోడలు నాగమణి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తలపైన బలంగా గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావంతో గొడవ జరిగిన ప్రదేశంలో అపస్మారక స్థితిలో అత్త పసలమ్మ పడిపోయింది. దీంతో చుట్టుపక్కల వారు వెంటనే 108కి సమాచారం ఇవ్వగా తీవ్ర గాయాలతో పడి ఉన్న పసలమ్మను 108సిబ్బంది హుటాహుటిన అనకాపల్లి 100పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పసలమ్మ మృతి చెందింది. అత్తను కర్రతో కొట్టి ఆమె మృతికి కారణమైన కోడలు నాగమణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసి నాగమణిని అరెస్టు చేసినట్టు చోడవరం సీఐ అప్పలరాజు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement