డాబాగార్డెన్స్: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురువారం త్రికాల పంచామృతాభిషేకం వైభవంగా జరిగింది. గురువారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో నిర్వహించిన ఈ విశేష సేవలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజలో నేరుగా పాల్గొనాలనుకునే భక్తులు రూ.1,000 పూజా రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. దూరప్రాంతాల్లో ఉండి, ఈ ప్రత్యేక పూజను పరోక్ష పద్ధతిలో చేసుకోవాలనుకునే భక్తుల కోసం బ్యాంక్ ఖాతా సౌకర్యం కల్పించారు. ఆసక్తి గల భక్తులు టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా సంఖ్య 060810011006691, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ UBIN0806081 ద్వారా పూజా రుసుము చెల్లించి పరోక్ష సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి, వేదపండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


