టీడీపీ నేతల అండతోనే ఉపాధి పనుల్లో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల అండతోనే ఉపాధి పనుల్లో అక్రమాలు

May 26 2026 2:56 AM | Updated on May 26 2026 2:56 AM

● ఆర్డీవోకు జనసేన నాయకుల ఫిర్యాదు

నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, ధర్మసాగరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం దొంగ మస్తర్లపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు సుకల లక్ష్మణ్‌రావు, నిద్దర కిరణ్‌, సామిరెడ్డి కిరణ్‌ డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనుల అక్రమాలపై పీజీఆర్‌ఎస్‌లో ఆర్డీవో వి.వి.రమణకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీకి చెందిన జెడ్పీటీసీ, నాయకుల అండతో వీఆర్‌పీ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉపాధి పనుల్లో దొంగ మస్తర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం మాది కాబట్టి మేము చెప్పినట్లే జరుగుతుందని స్వయాన జెడ్పీటీసీ గ్రామ సభలో పేర్కొన్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జెడ్పీటీసీ ఉపాధి కూలీలను సొంత పనులకు వాడుకుంటున్నారన్నారు. విద్యుత్‌ మీటర్‌ కావాలన్నా..గోకులం షెడ్డు కావాలన్నా జెడ్పీటీసీని అడగాలని అధికారులు చెప్పడం దారుణమన్నారు. అసలు పనికి రాని వారి పేర్ల మీద దొంగ మస్తర్లు వేసి నెల నెలా లక్షల రూపాయలు కాజేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో సుమారు 450 మంది ఉపాధి కూలీలు ఉన్నారన్నారు. ప్రతి రోజు 60 నుంచి 80 వరకు దొంగ మస్తర్ల వేసి నిధులు కాజేస్తున్నట్టు పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఉపాధి హామీలో జరుగుతున్న దొంగ మస్తర్లపై ఇది వరకే ఎంపీడీవో, ఏపీవోకు ఫిర్యాదుకు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. దొంగ మస్తర్లతో కష్టపడి పని చేసిన వారికి తీరని అన్యాయం చేస్తున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో విద్యుత్‌ స్తంభాన్ని తొలగించకుండా సీసీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ స్తంభం వల్ల రోడ్డు వేసినా ఎవరికి ప్రయోజనం లేదన్నారు. కాంట్రాక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకుని, విద్యుత్‌ స్తంభాన్ని తొలగించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement