● అక్కిరెడ్డిపాలెంలో దౌర్జన్యం
● ట్రాక్టర్ డ్రైవర్ కుటుంబంపై దాడి
తుమ్మపాల: ఏఎంఆర్ సంస్థ సిబ్బంది గ్రామాల్లో హల్‌చల్ చేస్తూ ప్రజలపై గూండాల్లా దాడులు చేస్తున్నారు. చిన్నాచితక యజమానులను కూడా వదలకుండా దౌర్జన్యంగా సీనరేజ్ వసూలు చేస్తున్నారు. పంటసాగుకు చేపట్టిన మట్టి తవ్వకాలకు సైతం పైకం కట్టాల్సిందేనంటూ రైతులను కూడా భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. జిల్లాలో ఏఎంఆర్ సంస్థ సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రజలు వాపోతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. తాజాగా ఆదివారం అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో టోల్‌టాక్స్ పేరుతో ఓట్రాక్టర్ డ్రైవర్ కుటుంబంపై ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు దాడికి తెగబడడం కలకలం రేపింది. వివరాలోకి వెళితే.. అక్కిరెడ్డిపాలేనికి చెందిన ఓవ్యక్తి తన ట్రాక్టర్‌తో సొంత పనుల నిమిత్తం గ్రావెల్ తరలిస్తుండగా ఏఎంఆర్ సంస్థ సిబ్బంది సీనరేజ్ కట్టాలంటూ అడ్డుకున్నారు. రేపు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వినకుండా సదరు సంస్థ ప్రతినిధులు దౌర్జన్యానికి దిగారు. ఆయన ఇంటిపై దాడిచేసి, కుటుంబసభ్యురాలైన కర్రికుమారి,ఆమె భర్తతో పాటు అడ్డువచ్చిన మరో గ్రామస్తుడిని తీ వ్రంగా కొట్టారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తు లు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగా రు.
పోలీసులకు ఫిర్యాదు
దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయా లని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సీపీఎం నేతలు హెచ్చరించారు.
ఎంపీ అండతోనే అక్రమ వసూళ్లు
ఈ ఘటనను సీపీఎం తీవ్రంగా ఖండించింది. సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ.. ఏఎంఆర్ అనేది ఒక అనధికార సంస్థ అని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఎంపీ సి.ఎం.రమేష్ అండదండలతోనే జిల్లాలో అక్రమ వసూళ్లకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఏఎంఆర్ సిబ్బంది ప్రజలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, తక్షణమే అక్కిరెడ్డి పాలెం వద్ద ఏర్పాటు చేసిన రెండు చెక్‌పోస్టులను తొలగించాలని డిమాండ్ చేశారు.


