21 నుంచి జీవీఎంసీ కార్మికుల సమ్మె బాట? | - | Sakshi
Sakshi News home page

21 నుంచి జీవీఎంసీ కార్మికుల సమ్మె బాట?

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

కమిషనర్‌తో చర్చలు విఫలమైతే

ఆందోళన తప్పదు

కాంట్రాక్ట్‌ కార్మికుల హెచ్చరిక

డాబాగార్డెన్స్‌(విశాఖ): జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌తో ఈ నెల 19న జరిగే చర్చలు ఫలవంతం కాకపోతే, 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి హెచ్చరించారు. జగదాంబ జంక్షన్‌ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషనర్‌ గత ఒప్పందాల మినిట్స్‌ను అమలు చేస్తారని ఆశించామని, కానీ కౌన్సిల్‌లో చేసిన తీర్మానాలను ఇప్పటివరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరా, వెటర్నరీ, పార్కులు, రిటైర్డ్‌, కారుణ్య నియామకాలు, లోడర్ల వేతనాల వంటి అంశాలపై ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని మండిపడ్డారు. ఇటీవల ఇన్‌చార్జి కమిషనర్‌(కలెక్టర్‌)తో జరిగిన ఒప్పందాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. చివరకు హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు, విలీన కార్మికుల పీఎఫ్‌ సొమ్ము, సప్లిమెంటరీ కార్మికుల జీతాల బిల్లులు, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సొమ్ము, జీవో 333 ఏరియర్స్‌ను కూడా చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడర్లు, బదిలీ, కాంట్రాక్ట్‌, ప్యాకేజీ, డైలీ వేజ్‌ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, సెలవులు ఇవ్వకుండా జీవీఎంసీ గొప్ప లు చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. నిత్యం చెత్త, దుర్వాసనలో ప్రాణాలకు తెగించి పనిచేసే వారికి కేవలం రూ.450 కూలి ఇచ్చి, బానిసల్లా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. వీరికి 3 నుంచి 4 నెలలుగా జీతాలు చెల్లించకపోతే కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. విలీన కార్మికులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి ఏడాది గడుస్తున్నా అమలు చేయలేద న్నారు. మరణించిన, రిటైర్డ్‌ కార్మికుల పిల్లలకు ముందుగా ఉపాధి కల్పించకుండా, బయటి వ్యక్తులను తీసుకోవడం ద్వారా పోస్టులను అమ్ముకుంటున్నారని కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అవినీతి జరిగాక ఇప్పుడు కమిషనర్‌ చర్యలకు ఆదేశాలు ఇవ్వడం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement