● ఉపయుక్తంగా గ్రామీణ వ్యవసాయ
పని అనుభవ (రాపెప్) కార్యక్రమం
● వ్యవసాయ విద్యార్థులకు గ్రామాల్లో ప్రత్యేక శిక్షణ
అనకాపల్లి: అధునిక యుగంలో అగ్రికల్చర్ డిగ్రీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. శ్రీకాకుళం జిల్లా నైరా అగ్రికల్చర్ నాలుగో ఏడాదికి కళాశాల 38 మంది విద్యార్థులు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిధిలో ఫిల్డ్ విజిట్‌లో భాగంగా శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో 38 మంది విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి ఒక విభాగంలో 18 మంది, మరో విభాగంలో 20 విద్యార్థులుగా ఒక్కో బృందానికి రైతులను అప్పగించి, గ్రామాల్లో రైతులు పండిస్తున్న పంటలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అధికారిగా ఆర్‌ఏఆర్‌ఎస్‌లో వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త దాడి ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఒక హోస్ట్ రైతును కేటాయించి, ఆయా రైతుల కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ భూముల వివరాలు, పంటల సాగు విధానాలు తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు గ్రామాల్లో రైతులతో ప్రత్యక్షంగా మమేకమై, గ్రామ సచివాలయం ద్వారా గ్రామానికి సంబంధించిన వివిధ వివరాలను సేకరిస్తున్నారు. రైతుల పొలాలను సందర్శించి పంటలలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి తగిన శాసీ్త్రయ సూచనలు అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ సమాచార కేంద్రం ఏర్పాటు చేసి, పంటలలో వచ్చే చీడపీడలు, వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ, సాంకేతికతలు, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రామ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారాన్ని నిరంతరం చేరవేసే పనిలో అగ్రికల్చర్ విద్యార్థులు చేస్తున్నారు. రాపెప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మట్టి నమూనాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించి, మట్టి పరీక్షల ప్రాముఖ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులతో సమూహ చర్చలు నిర్వహించి, పొలాల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. రైతులను నూతన సాంకేతికతలు, ఆధునిక వ్యవసాయ ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నారు. గ్రామ ప్రజల అభిప్రాయాలు, అవసరాలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పరిస్థితులపై సమగ్ర అవగాహన విద్యార్థులతో పాటు రైతులు పొందుతున్నారు.
నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన
కొత్త వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు పొలాల్లో మెథడ్ డిమానిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను ప్రదర్శిస్తూ మెరుగైన దిగుబడులు సాధించే మార్గాలను తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రైతులు అనుసరిస్తున్న పద్ధతులు, శాసీ్త్రయ సిఫార్సుల మధ్య ఉన్న తేడాలను గుర్తిస్తూ ‘గ్యాప్ అనాలిసిస్’నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి, పంటలలో మెరుగైన దిగుబడుల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించి అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయంపై ప్రత్యక్ష అనుభవం లభించడంతో పాటు రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెరుగుతోంది.


