రబీ ధాన్యం కొనుగోలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వేలాది మంది రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన రబీ వరి పంట కోత దశకు వచ్చింది. రబీ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో రైతులు టన్ను వద్ద రూ, 6 వేల వరకు ధర నష్టపోతున్నారు.
బుచ్చెయ్యపేట : వడ్డాది కస్పా పొలాల్లో ప్రతి ఏటా ఖరీఫ్‌తో పాటు రబీలోను 1,600 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారు. బుచ్చెయ్యపేట, దిబ్బిడి, చిన అప్పనపాలెం, ఎల్‌బీ పురం, వడ్డాది, బంగారుమెట్ట, కొత్తూరు తదితర గ్రామాల రైతులకు వడ్డాది కస్పా పొలాల్లో భూములున్నాయి. పెద్దేరు రిజర్వేయర్ ద్వారా కస్పా పొలాలకు నీటి హక్కు ఉండడంతో వేలాది మంది రైతులు భూమిని నమ్ముకుని వరి పంటను సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ, 20 నుంచి 25 వేలు వరకు పెట్టుబడులు పెడుతున్నారు. కష్టపడి పండించిన పంటను కోసి ధాన్యం అమ్ముదామంటే సర్కార్ అనుమతి లేదు. వారం, పది రోజులుగా కోసిన పంటను పొలాల్లోనే ఆరబెట్టిన రబీ ధాన్యం కొనుగోలుకు అనుమతులు లేవు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం టన్నుకు రూ, 24,610 ఉండగా, సాధారణ రకం ధర టన్ను రూ.24,410గా ఉంది. ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుకు అనుమతి రాక పలువురు రైతులు పొలాల్లో ఉన్న ధాన్యం పగలు, రాత్రుళ్లు కాపలా కాయలేక ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులకు టన్ను ధాన్యం రూ.18వేలు నుంచి రూ.19వేలు వేలకు తెగ నమ్ముకుంటున్నారు. టన్ను వద్ద 30 నుంచి 50 కేజీల ధాన్యం వ్యాపారులు లెస్ చేసి (తగ్గించి) రైతులను మోసగిస్తున్నారు. దీనివల్ల ఒక్కో రైతు టన్ను వద్ద రూ, 6,610 వరకు నష్టపోతున్నారు.
నెరవేరని కూటమి నేతల హామీ
రబీ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించిందని కూటమి నేతలు వారం రోజుల కిందటే ప్రకటించారు. వడ్డాది కోఆపరేటివ్ ద్వారా కస్పా పొలాల్లో ఉన్న రబీ ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రకటనలు చేసినా నేటికీ ధాన్యం కొనుగోలుకు ఎటువంటి అనుమతి రాలేదు. ధాన్యం కొనుగోలులో కూటమి నేతల మధ్య ఉన్న వర్గ పోరు వల్ల అనుమతులు రావడం ఆలస్యం అవుతుందని పలువురు రైతులు వాపోతున్నారు. రబీ ధాన్యంకు అనుమతి తీసుకొచ్చామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పి.వి.ఎస్.ఎన్ రాజు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఈర్లె శ్రీరామూర్తి, వడ్డాది కోఆపరేటివ్ అధ్యక్షుడు దొండా నరేష్ ప్రకటించారు. దీంతో తాతయ్యబాబుకు వ్యతిరేక వర్గమైన ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు వర్గీయులు రబీ ధాన్యం కొనుగోలు అనుమతికి ముందుకు రాకపోవడంతోనే అధికారులు కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమాయక రైతుల పట్ల కూటమి నేతలు కుటిల రాజకీయాలు మానుకుని తక్షణం ప్రభుత్వం నుంచి రబీ వరి ధాన్యం కొనుగోలుకు అనుమతులు తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
కోసిన ధాన్యం పొలాల్లోనే ఆరబెట్టిన రైతు
ధాన్యం కొనుగోలుకు ఆటంకాలు
కూటమి నేతలు హామీ ఇచ్చినా రాని అనుమతి
రైతుల గోడు పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు
దళారులకు వచ్చిన ధరకు తెగ నమ్ముకుంటున్న రైతులు
టన్ను వద్ద రూ.6 వేలు వరకు నష్టపోతున్న అన్నదాతలు
పంట కోసి ఐదు రోజులుగా ఎదురు చూపులు
రబీ వరి పంట కోసి ఐదు రోజులైంది. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా రాలేదని అధికారులు చెబుతున్నారు. పండించిన పొలంలోనే ధాన్యం ఆరబెట్టి ఐదు రోజులుగా రాత్రి, పగలు ఎదురు చూస్తున్నాను. అసలే ఎండా కాలం వడదెబ్బకు గురౌతున్నాను. నూర్చిన ధాన్యం పోగు వేసి ప్రభుత్వం కొంటుందని ఎదురు చూస్తున్నాను. ప్రైవేటు వ్యాపారులు వచ్చి టన్ను రూ.18 వేలకు ఇస్తావా అంటూ బేరాలు ఆడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలి.
–గాడి రమణ, బుచ్చెయ్యపేట రైతు
దళారుల చేతులో మోసపోతున్నాం
రబీ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ అనుమతి రాక దళారుల చేతుల్లో మోసపోతున్నాం. మద్దతు ధర 24 వేలకుపైగా ఉండగా ప్రైవేటు వ్యాపారులు మాత్రం రూ.18 వేలకు కొంటున్నారు. దీనివల్ల టన్ను వద్ద రూ.6 వేలు వరకు నష్టపోతున్నాం. రెండు ఎకరాల్లో వరి వేయగా మూడు టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుంది. సుమారు రూ.20 వేలు వరకు నష్టపోతున్నాం. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలి.
–దాడి మోదినాయుడు, బంగారుమెట్ట రైతు


