రూ.60 లక్షల విలువైన 450 గ్రా. బంగారం, 250 గ్రా. వెండి స్వాధీనం
ముగ్గురు పాత నేరస్తులు అరెస్ట్
మునగపాక పోలీసులు పక్కా స్కెచ్
పట్టుబడ్డ ముగ్గురూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్
అనకాపల్లి : వివిధ జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్ జిల్లా ఘరానా దొంగల ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. మునగపాక మండలంలో జరిగిన ఒకే ఒక్క దొంగతనం కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసే క్రమంలో ముగ్గురు మోస్ట్ వాంటెడ్ దొంగలను శనివారం అరెస్ట్ చేసినట్టు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) తుహిన్ సిన్హా వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 60 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు.
సినీ ఫక్కీలో ఛేజింగ్...
ఈ నెల 2వ తేదీన మునగపాక మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన ఒక దొంగతనంపై స్థానిక ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తుండగా పోలీసులకు సాంకేతిక ఆధారాలతో పాటు కీలక సమాచారం లభించింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో మునగపాక ఎస్‌ఐ పి. ప్రసాదరావుకు నిందితుల కదలికలపై సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి అనకాపల్లి బైపాస్ రోడ్డు లకీ్ష్పురం బస్ స్టాప్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే మోటార్ సైకిల్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి భయపడి బైక్ తిప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వారిని సినీ ఫక్కీలో వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు.
పాత నేరస్థులే..
పోలీసుల ప్రాథమిక విచారణలో పట్టుబడ్డ ముగ్గురూ పాత నేరస్థులని, వీరిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో అనకాపల్లి జిల్లా ఓ.కోటపాడు మండలం పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన రొంగలి ప్రకాష్ (24) మొదటి నిందితుడు (ఏ1) కాగా, విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ ఇర్ల వినయ్ కుమార్ (28) రెండో నిందితుడిగా (ఏ2), మళ్లీ పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ మూడో నిందితుడిగా (ఏ3) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు
పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారించడంతో నిందితులు మునగపాకలోనే కాకుండా పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా వరుస దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. యలమంచిలి టౌన్, ఎలమంచిలి రూరల్, రాంబిల్లి, అనకాపల్లి రూరల్, సబ్బవరం, విజయనగరం జిల్లా ఎస్.కోట, గుంటూరు జిల్లా నాదెండ్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరు చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. ప్రస్తుతం నిందితుల నుంచి రూ. 60 లక్షల సొత్తును స్వాధీనం చేసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన మునగపాక ఎస్‌ఐ ప్రసాదరావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


