అతిగథిలేని గృహాలు | - | Sakshi
Sakshi News home page

అతిగథిలేని గృహాలు

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

● ఒకనాడు ఎందరికో ముఖ్యులకు ఆతిథ్యం ● నేడు ఆలనాపాలనా లేక శిథిలావస్థకు భవనాలు

చోడవరం: ఒక నాడు బ్రిటిషు దొరతోపాటు నేటి మన పాలకుల వరకు అతిథులెందరికో విశ్రాంతినిచ్చిన ప్రభుత్వ అతిథి గృహాలు నేడు ఆలనాపాలనకు నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, వివిధ రంగాల ప్రముఖులు సైతం నాడు ఉపయోగించుకొని నేడు వారే పట్టించుకోకపోవడంతో నిరాదరణకు గురవుతున్నాయి. బ్రిటిషు దొరలు, విజయనగరం సామంతు రాజులు సైతం ఇక్కడ అతిథి గృహాల్లో విశ్రాంతి తీసుకొని పన్నులు వసూలు చేసేవారు. అంతటి వందేళ్ల చరిత్ర ఉన్న వసతి గృహాలు అక్కరకురాకుండా పోతున్నాయి. వీటిలో బ్రిటీషు కాలం, జమిందారీ కాలం నాటి అతిథి గృహాలు కొన్నయితే, జలాశయాల పర్యవేక్షణ కోసం నిర్మించిన గెస్ట్‌హౌస్‌లు మరికొన్ని ఉన్నాయి.

చోడవరం కేంద్రంగా నాడు బ్రిటిషు పాలకులు పన్నుల వసూలు చేసేందుకు, తెల్లదొరలు విశ్రాంతి తీసుకునేందుకు ఇక్కడ హార్డింజ్‌ గెస్ట్‌ హౌస్‌ను నిర్మించారు. అప్పట్లో ఈ గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవడం చాలా గొప్పగా చెప్పుకునేవారు. సుమారు వందేళ్లకు పైబడి అతిథులకు విశ్రాంతి ఇచ్చిన ఈ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. దేవాదాయశాఖ ఆధీనంలో ఉండటంతో ప్రస్తుతం ఉన్న నమూనాలోనే కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతుందని అంచనా వేయగా, అది ప్రతిపాదనల దశలోనే ఉండిపోయింది.

నిరుపయోగంగా కోనాం గెస్ట్‌ హౌస్‌...

చోడవరం పేరు చెబితే అందరీకి గుర్తుకొచ్చే మరో అతిథి గృహం కోనాం గెస్ట్‌ హౌస్‌. చీడికాడ మండలం కోనాం కొండల్లో రిజర్వాయరు నిర్మించేటప్పుడు ఈ గెస్ట్‌ హౌస్‌ను కట్టారు. నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు ఈ కోనాం గెస్ట్‌ హౌస్‌ను చోడవరంలో నిర్మించారు. రెండు ఏసీ గదులతోపాటు రెండు సూట్లు, పలు రూమ్‌లు, డైనింగ్‌ రూమ్‌తోపాటు ముఖ్యమంత్రులు, మంత్రుల కాన్వాయ్‌ల రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రోడ్డుతో కూడిన ప్రహరీ, చుట్టూ పచ్చని మొక్కలతో ఎంతో అందంగా ఈ గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. చాలా కాలం పాటు వీవీఐపీలకు అతిథి గృహంగా ఉండేది. ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు విశ్రాంతికి ఈ అతిథి గృహాన్ని వినియోగించేవారు. అయితే ఎనిమిదేళ్లుగా కోనాం గెస్ట్‌ హౌస్‌ నిరుపయోగంగా మారింది. ఇరిగేషన్‌ శాఖ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ వారు విద్యుత్‌ బిల్లులు, నిర్వహణ సరిగ్గా చేయడం పోవడంతో నిరుపయోగంగా మారింది. మొదట్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయగా తర్వాత నిర్వహణ లోపంతో అంతా బూజులు పట్టింది. ఆవరణంలో ఉన్న చెట్లు భవనంపై కూలిపోవడంతో కొంతమేర దెబ్బతింది. దీనితో ఈ గెస్ట్‌హౌస్‌కు పూర్తిగా తాళాలు వేసేశారు.

గజపతినగరంలో బంగ్లా ఆక్రమణ

రాజుల కాలంలో జమిందారులు చోడవరానికి నాలుగు కిలోమీటర్ల సమీపంలో గజపతినగరంలో ఒక భవనాన్ని నిర్మించారు. విజయనగరం సామ్రాజ్యానికి చెందిన ముఖ్యులు ఎవరైనా గుర్రాలపై వస్తే వారితోపాటు గుర్రాలకు కూడా విశ్రాంతి కల్పించేందుకు గుర్రాల శాలతో కూడిన అతిథిగృహాన్ని అప్పట్లో నిర్మించారు. క్రమేణా ఆర్‌అండ్‌బీ బంగ్లాగా మారి ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయి ఆక్రమణలకు గురైంది.

రెండు నియోజకవర్గాల్లో బసకు ఇబ్బందులు

మాడుగుల ఆర్‌అండ్‌బీ బంగ్లా, రైవాడ గెస్ట్‌ హౌస్‌లు కూడా అతిథులకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రభుత్వ అతిథి గృహాలన్నీ శిథిలావస్థలో ఉండటంతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పర్యటించే ప్రముఖులకు ఇప్పుడు ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క అతిథి గృహం కూడా లేకుండా పోయింది. ఎంతో గొప్ప గెస్ట్‌హౌస్‌లు ఉన్నప్పటికీ అవి శిథిలమై పోవడంతో భవనాలే కరువయ్యాయి.

సుగర్‌ ఫ్యాక్టరీ గెస్ట్‌ హౌసే గతి

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ గెస్ట్‌ హౌసే ఇప్పుడు అందరికీ ఉన్న ఏకై క అతిథి గృహంగా మారింది. అది కూడా రెండేళ్లుగా క్రషింగ్‌ చేయకపోవడంతో ఫ్యాక్టరీని మూసివేశారు. దీనితో మంత్రులు సైతం సొంత పార్టీ కార్యకర్తల ఇళ్లు, వారి సొంత గెస్ట్‌హౌస్‌ల్లో ఉండి వెళుతున్నారు. ఇప్పటికై నా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, దేవాదాయ శాఖలు చొరవ తీసుకొని అతిథి గృహాల మరమ్మతులు చేయడం లేదా వాటి స్థానే కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement