ఎస్.రాయవరం : సర్వసిద్ధి పీహెచ్‌సీ వైద్యాధికారితో పాటు, మరో ముగ్గురు సిబ్బంది శనివారం విధులకు హాజరు కాలేదు. వారు కనీసం సెలవు చీటీ అయినా పెట్టకుండా విధులకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. ఎంపీహెచ్ టి.నాగేశ్వరరావు ఆస్పత్రికి వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. కాగా నలుగురు సిబ్బంది ఒకే రోజు రాకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఉన్న సిబ్బంది తమకు మిగిలిన సిబ్బంది సమాచారం తెలియదని బదులిచ్చారు. వైద్యులు ఫోన్ సమాచారానికి కూడా అందుబాటులో లేరని రోగులు చెప్పారు. ప్రభుత్వం పీహెచ్‌సీకి భవనానికి కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసి సుమారు 18 నుంచి 30 మంది సిబ్బందిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా కనీసం గ్రామాల్లో వెల్ నెస్ కేంద్రాల్లో అందే సేవలు కూడా పీహెచ్‌సీలో అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది విధులకు రాని రోజు హాజరు పట్టీలో ఖాళీ ఉంచి, వచ్చిన రోజున ఆయా ఖాళీల్లోనూ సంతకాలు పెట్టి ఉన్నతాధికారుల కళ్లు కప్పుతున్నారు. సిబ్బంది పనితీరుపై స్థానిక ప్రజా ప్రతినిధులు పదే పదే ఫిర్యాదు చేసినా వారిలో మార్పు రాలేదు. ఇకనైనా జిల్లా వైద్యాధికారులు పీహెచ్‌సీ సిబ్బంది పని తీరుపై తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వైద్యాధికారి ఎన్.వాసంతి, పీహెచ్‌ఎన్, ఎంఆర్ సఖి, కంటి వైద్యులు కె.లక్ష్మి, హెచ్‌వీ వై. సూర్యకుమారి శనివారం సెలవు పెట్టకుండా విధులకు హాజరు కాలేదు. దీనిపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


