తగరపువలస: రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా కృషి చేయాలని హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ గంటి వెంకటేశ్వర్లు కోరారు. శనివారం ఆయన ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎంవీలో డిఫెన్స్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డిప్లమో రెండో బ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి బ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఐఐఎంవీ సిబ్బందిని అభినందించారు. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ బృందాలను ఉత్తేజపరుస్తూ, మార్పు వైపు నడిపించే బహుముఖ ప్రజ్ఞాశాలులే నిజమైన నాయకులన్నారు. చిన్నపాటి సానుకూల మార్పులైనా వ్యవస్థలపై పెద్ద ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఐఐఎంవీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ ప్రోగ్రామ్ పరిశ్రమ–అకాడెమియా సమన్వయంతో, కేస్ స్టడీస్ ఆధారిత లెర్నింగ్ విధానంలో రక్షణ రంగ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ బ్యాచ్‌లో ఆరు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, ఎన్‌ఏడీ, ప్రైవేట్ డిఫెన్స్ సంస్థలకు చెందిన అధికారులు ఉన్నారని చెప్పారు. అడ్మిషన్స్ చైర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ నాయర్ మాట్లాడుతూ.. ఈ బ్యాచ్‌లో అభ్యర్థుల సగటు వయసు 38 ఏళ్లు కాగా, వారికి 12 ఏళ్లకు పైగా పని అనుభవం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్ ప్రొఫెసర్ బి.శ్రీరంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


