గ్యాస్‌ మంట... ఓటీపీ తంటా..! | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ మంట... ఓటీపీ తంటా..!

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

● గిరిజనులకు ఆన్‌లైన్‌ కష్టాలు ● సెల్‌ టవర్లు లేవు..సెల్‌ఫోన్‌ పలకదు ● ఇక ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఎలా..? ● గ్యాస్‌ అందక మళ్లీ కట్టెలపొయ్యి దిక్కు

నాతవరం : గ్యాస్‌ వినియోగదారులకు గ్యాస్‌ బుకింగ్‌కు చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా విధించిన ఆన్‌లైన్‌ నిబంధనలు గిరిజనులను అవస్థల పాల్జేస్తున్నాయి. ఒకనాడు మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ప్రతి ఇంట్లో విధిగా పొగలేని పొయ్యిలు ఉండాలంటూ యుద్ధ ప్రతిపాదికన గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశారు. ఆ సమయంలో సరుగుడు సుందరకోట, కె.వి. శరభవరం గిరిజన పంచాయతీల్లో 90 శాతం గిరిజనులకు సెల్‌ఫోన్లు లేవు, గ్రామంలో దగ్గర బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు నంబర్లు బినామీ పేర్లతో గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేసేశారు. మొదట్లో గ్యాస్‌ కనెక్షన్లు ఆన్‌లైన్‌ కాకుండా ఆఫ్‌లైన్‌లో గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేసేవారు. తాజాగా గ్యాస్‌ కొరత కారణంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుని వినియోగదారుకు ఓటీపీ వస్తేనే గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేయాలని, ఆఫ్‌లైన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్‌ సరఫరా చేయరాదని నిబంధన విధించారు. దీంతో మండలంలో సుమారుగా 26 గ్రామాలకు పైగా గిరిజన గ్రామాల్లో గిరిజనులకు 800 నుంచి 1000 మంది వరకు గ్యాస్‌ సిలిండర్లు పొందలేకపోతున్నారు. సుందరకోట పంచాయతీ శివారు అసనగిరి, తొరడ, బమ్మిడికలొద్దు, కొత్త దద్దుగుల, కొత్త లంకలు, ముంతమామిడిలొద్దు, సిరిపురం, కొత్త సిరిపురం తదితర గిరిజన గ్రామాలు పూర్తిగా కొండలపై ఉన్నాయి. ఆ పంచాయతీలో ఒక్క సెల్‌ టవరు కూడా ఏర్పాటు చేయలేదు. అక్కడ గ్రామాలకు పూర్తిగా సెల్‌ సిగ్నల్స్‌ లేవు. కొండల మీద గిరిజనులకు సెల్‌ఫోన్లు ఉంటే కొండలు దిగి మైదాన ప్రాంతం నాతవరం వస్తేనే సెల్‌ సిగ్నల్స్‌ అందుతాయి.

సరుగుడు పంచాయతీ శివారు అచ్చంపేట, రామన్నపాలెం, దద్దుగుల, రాజవరం, యరకంపేట, మాసంపల్లి, కె.వి.శరభవరం పంచాయతీ శివారు కొండ ధర్మవరం, కృష్ణాపురం, కొడవటిపూడి అగ్రహారం తదితర గిరిజన గ్రామాల్లో కూడా సెల్‌ సిగ్నల్స్‌ లేవు. ఆయా గిరిజన గ్రామాల్లో అధిక శాతం ప్రజలకు సెల్‌ఫోన్‌ వినియోగంపై కనీస అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ కష్టాలతో గ్యాస్‌ సిలిండర్లు పొందలేక వారంతా తిరిగి వంట కోసం కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్నారు.

నాతవరం గ్రామంలో గల ఇండేన్‌ గ్యాస్‌ ఎజెన్సీ ద్వారా నాతవరం, గొలుగొండ, అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో సుమారుగా 16వేల మంది వినియోగదారులకు గ్యాస్‌ సరఫరా చేస్తున్నారు. నర్సీపట్నంకు చెందిన హెచ్‌పి గ్యాస్‌ ఏజెన్సీ నుంచి కూడా నాతవరం, గొలుగొండ మండలాల్లో కూడా వినియోగదారులకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఈ రెండు మండలాల్లో సుమారుగా 20 వేల గ్యాస్‌ వినియోగదారులు ఉన్నారు.

ఓటీపీ చెబితేనే గ్యాస్‌ సిలిండరు ఇస్తాం

కలెక్టరు, జాయింట్‌ కలెక్టరు ఆదేశాల ప్రకారం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుని ఓటీపీ నెంబరు వస్తేనే గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం. ఆఫ్‌లైన్‌లో ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్‌ ఇవ్వం. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ కాకపోతే వినియోగదారుడు మా ఆఫీసుకు గ్యాస్‌ నంబరు తీసుకు వస్తే ఈకేవైసీ చేసి ఫోన్‌లో బుకింగ్‌ చేసి లబ్ధిదారుకు గ్యాస్‌ ఇస్తాం.

– చెక్కా తాతారావు, ఇండేన్‌ గ్యాస్‌ డీలరు, నాతవరం

కట్టెల పొయ్యే గతి

కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనల కారణంగా గ్యాస్‌ డీలరు ఆఫ్‌లైన్‌లో గ్యాస్‌ సిలిండరు ఇవ్వలేదు. మా గ్రామాల్లో సెల్‌ టవర్లు ఏర్పాటు చేయలేదు. అలాంటప్పుడు మాకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఎలాగో తెలియదు. పాత పద్ధతుల్లోనే మా గిరిజన గ్రామాల్లో ఆఫ్‌లైన్‌లో బుక్‌ చేసుకుని గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలి.

– కొండపల్లి చింతల్లి, మాజీ సర్పంచ్‌, సుందరకోట పంచాయతీ

Advertisement
 
Advertisement
Advertisement