మండుటెండలో కలెక్టరేట్‌కు.. | - | Sakshi
Sakshi News home page

మండుటెండలో కలెక్టరేట్‌కు..

May 5 2026 7:14 AM | Updated on May 5 2026 7:14 AM

కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు

సమస్యల పరిష్కారం కోసం

గంటల కొద్దీ నిరీక్షణ

పీజీఆర్‌ఎస్‌ – 152 , రెవెన్యూ క్లినిక్‌–129 అర్జీలు

తుమ్మపాల: మండుటెండలోనూ కలెక్టరేట్‌కు అర్జీదారులు పోటెత్తారు. దూరాభారం నుంచి ఇక్కడకు వచ్చిన వారికి కనీసం నిలువ నీడ గానీ గుక్కెడు తాగునీరు గానీ సేద తీరేందుకు బెంచీలు గానీ వంటి సౌకర్యాలు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గంటల కొద్దీ ఎండలోనే వేచి ఉండాల్సి వచ్చింది. శంకరం హైవే నుంచి కలెక్టరేట్‌కు ఎండలో నడుచుకుంటూ వచ్చిన వృద్ధులు, మహిళలు అలసటతో చెమటలు కక్కుకున్నారు. అర్జీలు సమర్పించడానికి అవసరమైన జిరాక్స్‌ కేంద్రాలు కూడా కలెక్టరేట్‌ పరిసరాల్లో లేకపోవడంతో తిప్పలు పడ్డారు. దీంతో పలువురు నిరాశతో తమ పనులు పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేకంగా ఖర్చు చేసి ఆటోల్లో వచ్చినా పీజీఆర్‌ఎస్‌ వేదిక వద్దకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు కలెక్టరేట్‌ బయటే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్య ధోరణిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం–1, 2 లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో సుబ్బలక్ష్మి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీఓపెన్‌ కాకూడదని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌–152, రెవెన్యూ క్లినిక్‌–129 మొత్తం 281 వినతులు నమోదయ్యాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సూర్యలక్ష్మి, కె.శచీదేవి, వి.సుధీర్‌, జి.రామారావు, గోపాల్‌ రాజా, ఆశాదేవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ వారం వచ్చిన అర్జీల్లో మచ్చుకు కొన్ని...

●రాంకీ ఫార్మా కంపెనీ వ్యర్థాలను తాడి గ్రామానికి సమీప భూమిలో పాతిపెట్టడానికి చేసిన ల్యాండ్‌ ఫిల్‌ ప్రతిపాదనపై జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి రక్షించాలంటూ గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. ఫార్మా కంపెనీ కాలుష్యంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామాన్ని తరలించే ప్రక్రియ పూర్తికాకుండానే సర్వే నంబరు 116లో 91.44 ఎకరాలు ల్యాండ్‌ ఫిల్‌ కోసం కేటాయించడం అన్యాయమన్నారు.

●చోడవరం సున్ని జామియా మసీద్‌ ప్రెసిడెంట్‌ చేస్తున్న అవకతవకలపై విచారణ చేపట్టి, వక్ఫ్‌ బోర్డు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ జనతా వారధి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు తమ రాజీనామా పత్రాలతో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. 13 ఏళ్లుగా ప్రెసిడెంట్‌గా కొనసాగుతూ ఖబ్రస్తాన్‌ అభివృద్ధి పేరుతో చందాలు వసూలు చేసి చెరువు మట్టి వేసి రూ.2.70 లక్షలు దుర్వినియోగం చేశారని, మసీద్‌ నూతన షాపులను తక్కువ అద్దెకు ఇవ్వడం, కొబ్బరి కాయల ఆదాయం వంటి అంశాలపై విచారణ చేపట్టి మసీద్‌ను కాపాడాలని కోరారు.

●ఫోర్జరీ పత్రాలతో ఆశ్రమ పాఠశాల భూములను ఆక్రమించి అక్రమ కేసులు బనాయించి ప్రాణహాని తలపెడుతున్న గణపతి, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇంటిగ్రేటెడ్‌ వికలాంగుల ఆశ్రమ పాఠశాల వ్యవస్థాపకుడు (దివ్యాంగుడు) సత్య తిరుపతిరావు పట్నాయక్‌, దివ్యాంగులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

●భూ సమస్య పరిష్కారం కోసం పసిబిడ్డతో కలెక్టరేట్‌కు వచ్చాను. పసుపుకుంకుమ కింద మా అమ్మ నాకిచ్చిన భూమిని గెంజినాయుడు, శ్రీను ట్రాక్టర్‌తో వచ్చి దుక్కిదున్నారు. అడిగినందుకు తీవ్రంగా భయపించారు. గ్రామంలో సర్వే నంబరు 150/8లో నా భూమి నాకు లేకుండా చేస్తున్నారంటూ చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామానికి చెందిన శ్రీలెక్కల ఈశ్వరమ్మ రెవెన్యూ క్లినిక్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement