మునగపాక ఎంపీపీగా కృష్ణవేణి ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

మునగపాక ఎంపీపీగా కృష్ణవేణి ఎన్నిక

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

● వైస్‌ ఎంపీపీలుగా సంజీవిని,కాశీ సురేష్‌ ● ఎన్నిక ఏకగ్రీవం

మునగపాక: మునగపాక ఎంపీపీ, ఇద్దరు వైస్‌ ఎంపీపీలుగా వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మలాడ ఎంపీటీసీ సభ్యురాలు మొల్లేటి కృష్ణవేణి ఎంపీపీగా, పల్లపు ఆనందపురం ఎంపీటీసీ సభ్యుడు కర్రి సంజీవిని, నాగులాపల్లి–2 ఎంపీటీసీ సభ్యుడు మళ్ల కాశీ సురేష్‌ వైస్‌ ఎంపీపీలుగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి మంజులావాణి తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ హాలులో గురువారం ఎంపీపీ, రెండు వైస్‌ ఎంపీపీ స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. 15 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 11 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. ఎంపీపీ స్థానానికి ఉమ్మలాడ ఎంపీటీసీ సభ్యురాలు మొల్లేటి కృష్ణవేణి పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎంపీటీసీ సభ్యులంతా బలపరిచారు. దీంతో ఎంపీపీగా కృష్ణవేణి ఎన్నికై నట్టు ప్రకటించారు. పల్లపు ఆనందపురం ఎంపీటీసీ సభ్యుడు కర్రి సంజీవిని పేరును వైస్‌ ఎంపీపీ–1గా మునగపాక ఎంపీటీసీ–2 సభ్యుడు సూరిశెట్టి రాము ప్రతిపాదించగా, నాగులాపల్లి ఎంపీటీసీ సభ్యుడు మళ్ల కాశీ సురేష్‌ బలపరిచారు. అలాగే వైస్‌ఎంపీపీ–2గా నాగులాపల్లికి చెందిన మళ్ల కాశీ సురేష్‌ పేరును కాకరాపల్లి ఎంపీటీసీ సభ్యుడు ఇల్లా శిరీషా ప్రతిపాదించగా చూచుకొండ ఎంపీటీసీ సభ్యుడు కాండ్రేగుల కిరణ్‌కుమార్‌ బలపరిచారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి మంజులావాణి ప్రకటించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ సమక్షంలో ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించారు.

ఎంపీపీ,వైస్‌ ఎంపీపీలకు సత్కారం

ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీపీ మొల్లేటి కృష్ణవేణి,వైస్‌ ఎంపీపీలు కర్రి సంజీవిని,మళ్ల కాశీ సురేష్‌లను వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽఽథ్‌, వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, జెడ్పీటీసీ సభ్యులు పెంటకోట స్వామి సత్యనారాయణ,పార్టీ మండల అధ్యక్షుడు ఆడారి అచ్చియ్యనాయుడు తదితరులు వారిని సత్కరించారు.ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ మునగపాక మండలంలో జనసేనకు చెందిన ఇద్దరు వైస్‌ ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టి వారి స్థానంలో వైఎస్సార్‌సీపీ నేతలు గెలుపొందడం తొలి విజయంగా పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయానికి ఈ ఎన్నిక నాంది పలుకుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులంతా పార్టీ మరింత బలోపేతం కావడానికి పనిచేయాలన్నారు. ప్రజా స్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీదే విజయమనడానికి ఈ ఎన్నికే నిదర్శనమని తెలిపారు. ఇదే ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు సర్పంచ్‌లు,ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement