టీడీఆర్‌ బాండ్లపై హైకోర్టు తీర్పు హర్షణీయం | - | Sakshi
Sakshi News home page

టీడీఆర్‌ బాండ్లపై హైకోర్టు తీర్పు హర్షణీయం

Apr 17 2026 11:02 AM | Updated on Apr 17 2026 11:02 AM

● గ్రామసభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి ● సాగునీటి కాలువలు మూసేయడం తగదు ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

మునగపాక : నిర్వాసితులకు టీడీఆర్‌ బాండ్లు కాకుండా నేరుగా పరిహారం చెల్లించేలా ఇటీవల హైకోర్డు ఇచ్చిన తీర్పు హర్షణీయమని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్‌ కొనియాడారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో పూడిమడక రోడ్డు విస్తరణకు సంబంధించి టెండర్లు పిలిచారన్నారు. రహదారి విస్తరణ ద్వారా ప్రమాదాలు జరగకుండా ఉండడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 100 అడుగుల మేర 14 కిలో మీటర్ల వరకు రహదారి విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు.

రహదారి విస్తరణలో భాగంగా గృహాలు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం కూటమి ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. ఆర్‌డీవో సమక్షంలో గ్రామసభలు నిర్వహించి రహదారి విస్తరణ బాధితులకు పరిహారాన్ని నేరుగా అకౌంట్‌లో జమచేస్తామని చెప్పుకొచ్చి సంతకాలు సేకరించారన్నారు. తరువాత ప్రభుత్వం మాటమార్చి పరిహారాన్ని నగదు రూపంలో కాకుండా టీడీఆర్‌ల ద్వారా ఇస్తామని చెప్పడంతో మెజార్టీ నిర్వాసితులు అంగీకరించలేదన్నారు. గ్రామసభల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు.

ముంపులో పొలాలు

సాగునీటి కాలువలను మూసివేసి రెయిలింగ్‌లు నిర్మించడాన్ని రైతులు తప్పుపడుతున్నారన్నారు. ఎటువంటి భూసేకరణ చేపట్టకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను కప్పేయడం ద్వారా వేలాది ఎకరాల పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు రైతులు, నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 19న మునగపాకలో సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్యియ్యనాయుడు, ఎంపీపీ మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, నాయకులు నరాలశెట్టి సూర్యనారాయణ, దొడ్డి బుజ్జి, బొద్దపు శ్రీరామ్మూర్తి, కాండ్రేగుల జగన్‌, బొడ్డేడ శ్రీనివాసరావు, బొడ్డేడ బుజ్జి, పిన్నమరాజు రవీంద్రరాజు,నరాలశెట్టి తాతారావు, శ్రీపతి రామకృష్ణ, ఆడారి కాశీబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement