దేవరాపల్లి : దేవరాపల్లిలో ఈ నెల 19న నిర్వహించే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గురువారం జిల్లా మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అనగానుపాడులో 1937లో పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన సంఘం నేడు దేశ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా వ్యాప్తి చెంది అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘంగా ఏర్పడిందన్నారు. పేదలకు భూమి, తిండి, బట్ట, విద్య, వైద్యం కోసం దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. అనకాపల్లి జిల్లాలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, లింక్ రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తదితర ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించిన చరిత్ర ఉందన్నారు. ప్రతి మూడేళ్లకోసారి జరిగే జిల్లా మహాసభల్లో భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. దేవరాపల్లిలో ఆదివారం జరిగే 14వ జిల్లా మహాసభలకు రాష్ట్ర, జిల్లా సంఘం నాయకులు హాజరవుతారన్నారు. ఈ మహాసభలకు ఉపాధి కూలీలు, గిరిజన కూలీలు, వృత్తిదారులు, రైతులు, కార్మికులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.గోవిందరావు, కె. భవానీ, గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా కార్యదర్శులు ఇరటా నర్సింహమూర్తి, బి.టి.దొర పాల్గొన్నారు.


