తుమ్మపాల : విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరాలంటే ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఫలితాలు తక్కువగా వచ్చిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. మంచి ఫలితాలు సాధించిన పాఠశాలలను అభినందించారు. తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నమోదైన ఉత్తీర్ణత శాతాన్ని గత ఏడాదితో పోల్చి చూశారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం త్వరలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షల దృష్ట్యా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించని విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా, వారికి మానసిక, మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు కౌన్సెలింగ్ సెషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు జి.అప్పారావునాయుడు, వినోద్ బాబు, జిల్లా సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల, సంక్షేమ శాఖ అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.


