●గతేడాది కంటే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం
●ఇంటర్ ఫస్టియర్‌లో 12వ స్థానం, సెకండియర్‌లో 13వ స్థానంతో సరి
●ఫస్టియర్‌లో 74 శాతం, సెకండియర్‌లో 79 శాతం ఉత్తీర్ణత
●ప్రభుత్వ కళాశాలల్లో నిరాశాజనకమైన ఫలితాలు
సాక్షి, అనకాపల్లి : ఇంటర్ ఫలితాల్లో బాలురు కన్నా బాలికలదే పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలతో పోల్చితే జిల్లాకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఓవరాల్‌గా అనకాపల్లి జిల్లా 13వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్రథమ సంవత్సరంలో 12వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 13వ స్థానంతో జిల్లా ఫలితాలు నిలిచాయి. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో 74 శాతం, సెకండియర్‌లో 79 శాతంతో జిల్లా ఫలితాలు గతేడాది కంటే కాసింత స్వల్పంగా ఉత్తీర్ణతా శాతం పెరిగింది. మొదటి సంవత్సరంలో 10,315 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 7,602 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్‌లో 9926 మంది పరీక్షలకు హాజరు కాగా 7,829 మంది పాసయ్యారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్‌లో 62.62 శాతం, సెకండియర్‌లో 72.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది స్వల్పంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. అయితే మొత్తంగా ప్రభుత్వ కళాశాలల్లో నిరాశజనకమైన ఫలితాలు వచ్చాయి.
సత్తా చాటిన బాలికలు
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను పరిశీలిస్తే బాలికలదే పై చేయి కనబరిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 4,303 మంది బాలురు గాను 2812 మంది బాలురు ఉత్తీర్ణత(65.34 శాతం) సాధించారు. బాలికలు 6012 మందికి గానూ 4,790 బాలికలు ఉత్తీర్ణత(79,67 శాతం) సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 10315 బాలురు పరీక్షలు రాయగా 7602 మంది ఉత్తీర్ణత(74 శాతం) సాధించారు. అదేవిధంగా 9926 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 7829 మంది ఉత్తీర్ణత(79 శాతం) సాధించారు.
సెంకడ్ ఇయర్‌లోనూ బాలికలదే పైచేయి
కశింకోట మండలం తాళ్లపాలెం గురుకుల కళాశాలకు చెందిన తాడి హేమలత, (983), తేగాడ కేజీబీవీ విద్యార్థిని జి.రమ్య (987) మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెకెండ్ ఇయర్‌లో ఎంపీసీలో రోలుగుంట జీఎల్‌సీకు చెందిన ఎం.మేధశ్రీ (981/1000), జీఏసీ కోటవురట్లకు చెందిన పి.స్వాతి(980/1000) టాప్‌లో నిలవగా బైపీసీలో యల మంచిలి జేఎల్‌సీకు చెందిన గణపర్తి గిరిజ (982/1000), కేడీపేటకు చెందిన జీజేసీ ఎస్.అమృత(980/1000) టాప్‌లో నిలిచారు. అదేవిధంగా సీఈసీలో జీజేసీ పరవాడకు చెందిన జి.భారతి(952/1000), హెచ్‌ఈసీలో జీఏసీ కొత్తకోటకు చెందిన సీహెచ్ వైష్ణవి(964/1000) మార్కులతో సత్తా చాటినట్టు డీఐఈఓ వినోద్‌బాబు తెలిపారు.
ఇంటర్ ఒకేషనల్ ఫలితాలు
ఇంటర్ ఒకేషనల్‌లో సెకండ్ ఇయర్‌లో 2117 విద్యార్థులకుగానూ 1530 మంది ఉత్తీర్ణత(72.27 శాతం), ఫస్ట్ ఇయర్‌లో 2424 విద్యార్థులకు గానూ 1465 మంది ఉత్తీర్ణత( 60.44 శాతం) సాధించారు.
మే 21 నుంచి సప్లిమెంటరీ
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జూన్ 7 నుంచి 11 వరకూ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 27వ వరకూ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అఽధికారి(డీఐఈఓ) వినోద్‌బాబు తెలిపారు.


