తుమ్మపాల : పరిశ్రమల నిర్వహణకు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. జిల్లాలోని వివిధ విభాగాల అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం వెర్వేరుగా జరిగిన డీఐఈపీసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పర్ట్ అండ్ ప్రమోషన్ కమిటీ), పర్యాటక అభివృద్ధి మండలి సమావేశాల్లో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో పరిశ్రమలు, పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సహకాలు, అనుమతులు త్వరితగతిన మంజూరుచేసి ప్రోత్సహించాలన్నారు.
పారిశ్రామిక అనుమతుల కొరకు సింగిల్ డెస్క్ పాలసీలో వివిధ శాఖల వద్ద పెండింగులో గల దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హత, ఆసక్తి గల వారికి వెంటనే అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, రుణ సదుపాయం పొందేందుకు సహకారం అందించాలని కోరారు. కేటాయించిన భూముల్లో నిర్ణీత సమయంలో సదరు నిర్వాహకులు పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎకో టూరిజం కింద కొండకర్ల ఆవను అభివృద్ధి చేయాలని, జిల్లాలో ప్రాచీన కట్టడాలను, దేవాలయాలను అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బొజ్జన్నకొండను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని టూరిజం అధికారులను ఆదేశించారు.
23న సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ఈ నెల 23 న జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో రాంబిల్లి సెజ్‌లో నిర్వహించనున్న రెన్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు 10 నుంచి 20 వేల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తూ, అందుకు తగిన విధంగా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
సభావేదిక స్టేజీ ఏర్పాట్లు, వీఐపి, వీవీఐపి గ్యాలరీ, డెకరేషన్ వంటి ఏర్పాట్లు నిర్దేశిత సమయంలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం సమీపంలో 10 ఎకరాల్లో సభా ప్రాంగణ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలను తరలించేందుకు సుమారు 200 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, ఆర్డీవో అయేషా, సంబంధిత శాఖల అధికారులు, రెన్యూ సోలార్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


