రహదారి, శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

రహదారి, శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి : జిల్లాలో పెండింగ్‌ కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతిభద్రల పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో బుధవారం పోలీస్‌ క్రైం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆయన కోరారు. హెల్మెట్‌ లేకపోవడం, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్‌ చలానాలు చెల్లించని వాహనాలను సీజ్‌చేసి, రవాణాశాఖ ద్వారా లైసెన్సుల రద్దుకు సిఫార్సు చేయాలన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులపై అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారి, ఆర్‌అండ్‌బీ, జీవీఎంసీ, రవాణాశాఖల సమన్వయంతో ప్రమాదకర ప్రాంతాల్లో సాండ్‌ డ్రమ్స్‌, రంబుల్‌ స్ట్రిప్స్‌, స్పీడ్‌ బేకర్లు, రేడియం స్టిక్కర్లు, లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. సెజ్‌ ప్రాంతాల, బ్రాండిక్స్‌ బస్సు డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. రౌడీషీటర్లకు ప్రతివారం కౌన్సిలింగ్‌ నిర్వహించి, రూ.1లక్ష వరకు బైండోవర్‌ చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్‌డీపీఎస్‌ కేసుల్లో తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై పిట్‌ ఎన్‌డీపీఎస్‌ కింద చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్‌ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలపట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. దర్యాప్తులో ఫేస్‌ రికగ్నిషన్‌ సర్విలియన్స్‌, సీసీటీఎన్‌ఎస్‌, ఈ–సాక్ష, యూప్‌ 360 వంటి అప్లికేషన్లను విరివిగా వాడి కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల పోలీస్‌ స్టేషన్లలో ఎస్‌ఓపి పక్కాగా అమలు చేయాలని, తప్పిపోయిన బాలబాలికల గుర్తింపు, చోరీకి గురైన వాహనాల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహన్‌రావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, బి.మోహనరావు, ఇ.శ్రీనివాసులు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, గణేష్‌, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement