టికెట్ల సంఖ్య పెంచినా తప్పని నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

టికెట్ల సంఖ్య పెంచినా తప్పని నిరీక్షణ

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

● ఉదయం 6 గంటల నుంచి జనాల బారులు

సింహాచలం: బ్యాంకుల్లో చందనోత్సవం టికెట్ల జారీ సంఖ్యను బుధవారం నుంచి పెంచినా భక్తులకు పూర్తిస్థాయిలో సరిపోలేదు. ముఖ్యంగా రు.1000 టికెట్లు విక్రయాలు ప్రారంభమైన అరగంటలోనే అయిపోయాయి. దీంతో చాలామంది భక్తులు నిరాశతో వెనుదిరిగారు. రూ.300 టికెట్లు మధ్యాహ్నం వరకు జారీ చేశారు. ఈ ఏడాది చందనోత్సవం టికెట్లు జారీ ప్రక్రియలో 70 శాతం ఆన్‌లైన్‌, 30 శాతం బ్యాంకుల్లో ఆఫ్‌లైన్‌లో ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ సరిగ్గా పనిచేయకపోవడం, 13, 14 తేదీల్లో బ్యాంకుల్లో టికెట్లు సరిపోకపోవడంతో బుధవారం నుంచి బ్యాంకుల్లో టికెట్ల విక్రయాలు 50 శాతానికి పెంచారు. దీంతో సింహాచలంలోని యూనియన్‌ బ్యాంకు, స్టేట్‌బ్యాంకు వద్దకు బుధవారం ఉదయం 6 గంటల నుంచే జనాలు క్యూ కట్టారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభించగా.. స్టేట్‌బ్యాంకులో అరగంటలోపు, యూనియన్‌ బ్యాంకులో 45 నిమిషాలలోపు రూ.1000 టికెట్లు అయిపోయాయి. రూ.300 టికెట్లు మాత్రం మధ్యాహ్నం వరకు జారీచేశారు. ఒక్కో బ్యాంకుకి దేవస్థానం రూ.300 టికెట్లు 12వందలు, రూ.1000 టికెట్లు 880 అందజేసింది. బ్యాంకుల్లో ఒక్కో భక్తుడికి ఆధార్‌ కార్డుపై రెండు రూ.1000 టికెట్లు, నాలుగు రూ.300 టికెట్లు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement