యలమంచిలి రూరల్ : వారంతా పేదింటి బిడ్డలు... ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలతో అద్భుతంగా రాణించి తాము చదువుకున్న కళాశాలకు..తల్లిదండ్రులకు పేరు తెచ్చారు.చదువుకు పేదరికం అడ్డుకాదంటూ ఇంటర్ ఫలితాల్లో తమ సత్తా చాటారు.యలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండో సంవత్సరం విద్యార్థినులు జి.గిరిజ బైపీసీలో 982,ఎంపీసీలో ఎం.దివ్య 974 మార్కులు సాధించారు.మొదటి సంవత్సరం విద్యార్థులు ఆర్. వెంకటలక్ష్మి 442(ఎంపీసీ), కె.కృష్ణవేణి 441(ఎంపీసీ) మార్కులతో ప్రతిభ చూపారు.
సాధారణ రైతు కుటుంబాల నుంచి ...
వారిద్దరూ సాధారణ రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులు. ప్రణాళికాబద్ధంగా చదివారు. క్రమం తప్పని సాధనతో యల్లపు ప్రశాంతి,పిల్లా కావ్య మెరుగైన ఫలితాలు సాధించారు సోమలింగపాలెం గ్రామానికి చెందిన యల్లపు ప్రశాంతి ఇంటర్మీడియెట్ ఫలితాల్లో 978 మార్కులు, రాంబిల్లి మండలం మూలజంప గ్రామానికి చెందిన పిల్లా కావ్య 966 మార్కులు సాధించారు. మంచి మార్కులు సాధించిన ప్రశాంతిని తల్లిదండ్రులు శ్రీనివాసు,లత బుధవారం స్వీటు తినిపించి అభినందించారు.ఉన్నత చదువులు చదివి మంచి ప్రభుత్వోద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమని వారిద్దరూ సాక్షికి తెలిపారు.తమ విద్యార్థులు ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించడం పట్ల గీతాంజలి కళాశాల చైర్మన్ పి.సురేష్‌బాల్ ఆనందం వ్యక్తం చేసి, విద్యార్థినులను అభినందించారు.
కశింకోట: మండలంలోని మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన బాలికలంతా కూలీల పిల్లలే కావడం విశేషం. తేగాడలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చదివిన జి.రమ్య బైపీసీలో 987 మార్కులతో మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. బుచ్చియ్యపేట మండలం చిన్న మల్లాం గ్రామానికి చెందిన ఆమె తండ్రి అప్పలనాయుడు రోజువారీ కూలీ. తల్లి లక్ష్మి గృహిణి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా డాక్టర్ కావాలని రమ్య ఆకాంక్షిస్తున్నట్లు సాక్షికి తెలిపింది. ద్వితీయ స్థానంతో 983 మార్కులు పొందిన కె.గంగా భవానిది రావికమతం మండలం గొంప గ్రామం. తండ్రి రాము రోజు వారీ కూలీ. తల్లి సత్యవతి. ఆమె కూడా డాక్టర్ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 974 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిన జి. సంధ్య కశింకోట మండలంలోని గోకివానిపాలెం గ్రామానికి చెందిన రాజు, చినతల్లి కుమార్తె. తండ్రి రోజు వారీ కూలీ. బీఫార్మసీ చేయాలని లక్ష్యమని తెలిపింది. తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో చదువుతూ ఇంటర్‌లో ద్వితీయ స్థానంలో 983 మార్కులతో నిలిచిన తాడి హేమలతది మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామం. తండ్రి చిన మహాలక్ష్మి, తల్లి వరలక్ష్మి. వీరు కూలీలు. కొండ్రి నాగలక్ష్మి 969 మార్కులతో తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించింది. నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన తండ్రి అప్పారావు, తల్లి పార్వతి కూలీలు. వైద్య రంగంలో స్థిరపడాలని ఆకాంక్షిస్తోంది.
డాక్టర్ కావడమే ధ్యేయం
కశింకోట: తాను డాక్టర్‌ను కావాలని ఆశిస్తున్నట్టు ఇంటర్మీడియెట్‌లో అత్యధికంగా 987 మార్కులు సాధించిన కాకర ప్రవల్లిక తెలిపింది. మండలంలోని తాళ్లపాలెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియెట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడింది. మాడుగుల మండలం కింతలిలో నివసిస్తున్న తన తల్లిదండ్రలు రాజు, ఆనందరావు కూలీ పనులు చేస్తున్నట్టు తెలిపింది. నీట్ రాసి ఎంబీబీఎస్ చదవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆమె చెప్పింది. లేదంటే నర్సింగ్ అయినా చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది.
ఆర్ వెంకటలక్ష్మి, 442/470
జి.గిరిజ, 982/1000
ప్రభుత్వ జూనియర్ కళాశాల, యలమంచిలి


