బుచ్చెయ్యపేట: మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడంపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బుచ్చెయ్యపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నాగేశ్వరిదేవి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది. 35 పంచాయతీలకు చెందిన ఎంపీటీసీలు హాజరైనా పలుశాఖలకు చెందిన మండల అధికారులు హాజరుకాలేదు. మూడు నెలలకొకసారి జరిగే మండల సర్వ సభ్య సమావేశానికి ప్రజల సమస్యలు తెలపడానికి జీతం లేకపోయినా మేం హాజరవుతున్నాం, రూ.లక్షల జీతాలు తీసుకుంటున్న అధికారులు ఎందుకు హాజరుకావడం లేదని ఎంపీడీవో శివ నారాయణను జెడ్పీటీసీ దొండా రాంబాబు,వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి,గొంపా చినబాబు,కోఆప్షన్ సభ్యుడు కె.అచ్చింనాయుడు తదితరులు ప్రశ్నించారు. గైర్హాజరైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తహసీల్దార్, ఎంఈవో, విద్యుత్, సివిల్ సప్లయి, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ, ఐసీడీఎస్, అటవీశాఖ, పంచాయతీరాజ్,హార్టికల్చర్, సెరి కల్చర్,దేవదాయశాఖ,సోషల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు హాజరుకాకపోగా కొన్ని శాఖల అధికారులు కిందస్థాయి సిబ్బందిని పంపించారని, వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో సర్ది చెప్పడంతో ప్రజాప్రతినిధులు శాంతించారు. వడ్డాది,బుచ్చెయ్యపేట, తురకలపూడి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి నిధులు ఖర్చుల వివరాలు స్థానిక నాయకులకు తెలపకపోవడంపై నిలదీశారు. పలు సమస్యలను మండల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ఎంపీడీవోను నిలదీసిన ఎంపీటీసీలు


